సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు తెలంగాణా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు వేర్వేరుగా శుభాకాంక్షల ప్రకటనలు విడుదల చేశారు. దసరా పండుగ (విజయదశమి) సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ, తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారని అన్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. శమీపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణకు ప్రత్యేకమని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ అప్రతిహత విజయాలతో అభివృద్ధి సాధించాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలతో ఈ పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆ దుర్గామాతను ప్రార్థిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.

మంత్రి పొంగులేటి దసరా శుభాకాంక్షలు:
తెలంగాణా రాష్ట్ర ప్రజలకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దసరా పర్వదినం చెడుపై ధర్మం విజయం సాధించిన శుభసంకేతంగా చెప్పారు. ఈ విజయదశమి సందర్భంగా ప్రజల కుటుంబాల్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం నిండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ ఇంటిలో ఆనందం అలముకోవాలని, ప్రతీ మనసులో సంతోషం విరజిమ్మాలని కోరుకుంటున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు.

మంత్రి తుమ్మల దసరా శుభాకాంక్షలు:
తెలంగాణా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలుగు ప్రజలు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకునే ఈ దసరా పండుగను తెలుగు ప్రజలందరూ ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ విజయం, ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తుమ్మల చెప్పారు.

రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు దసరా శుభాకాంక్షలు:
దసరా పండుగ (విజయదశమి)సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పర్వదినం సందర్భంగా తెలంగాణ వాసులు, దేశం నలుమూలల, విదేశాల్లో నివసిస్తున్న, స్థిరపడిన తెలంగాణ బిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. దుర్గామాత కరుణ, కటాక్షాలతో తెలంగాణ బిడ్డలందరికి మంచి జరగాలని, సుఖ సంతోషాలతో వర్థిల్లాలని అభిలషిస్తున్నట్లు వద్దిరాజు చెప్పారు.

