ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లీగల్ నోటీస్ జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి స్థాయి నాయకుడికి లీగల్ నోటీస్ జారీ చేసిన ఆ సీఐ పేరు జె. శంకరయ్య. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్ధేశపూరితంగా చంద్రబాబునాయుడు అనేకసార్లు తప్పులు ప్రకటనలు చేశారనేది సీఐ శంకరయ్య ఆరోపణ. ఈ అంశంలో అసెంబ్లీలో చంద్రబాబు తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తన పరువు, ప్రతిష్టలకు నష్టం కలిగించినందుకుగాను రూ. 1.45 కోట్ల పరిహారం చెల్లించాలని సీఐ శంకరయ్య తన అడ్వకేట్ జి. ధరణేశ్వర్ రెడ్డి ద్వారా లీగల్ నోటీస్ జారీ చేశారు.
ఈనెల 18వ తేదీనే శంకరయ్య ఈ నోటీసును పంపగా, తాజాగా వెలుగులోకి రావడం గమనార్హం. వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం సమయంలో శంకరయ్య పులివెందుల సీఐగా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చిలో హత్యకు గురైనపుడు సీఐగా ఉన్న శంకరయ్య సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని, రక్తపు మరకలు కడిగేశారని చంద్రబాబునాయుడు పలుసార్లు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్నూలు రేంజ్ లో వేకెన్సీ రిజర్వు(వీఆర్)లో గల సీఐ శంకరయ్య తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు జారీ చేయడం చర్చకు దారి తీసింది.


