బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర బుధవారం సంచలనాత్మకంగా వ్యవహరించారు. ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ప్రభుత్వం బుధవారం సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికార పార్టీకి చెందిన పలువురు ఎంపీలతోపాటు బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీజేపీ తరపున ఎంపీలు డీకే అరుణ, రఘనందన్ రావు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ తదితరులు హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశానంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అప్పట్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ లు స్నేహగీతికను ఆలపించారని, ఆనాడు కేసీఆర్ చేసిన సంతకం ఈరోజు తెలంగాణాకు సమస్యగా మారిందని పేర్కొన్నారు. అయితే అప్పట్లో తెలంగాణా ప్రయోజనాల కోసమే కేసీఆర్ పాటుపడ్డారని రవిచంద్ర సీఎం వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పారు. ఈ సందర్భంగా సీఎం, వద్దిరాజుల మధ్య పలుసార్లు వాగ్వాదం కూాడా జరిగింది. సీఎం వ్యాఖ్యలపై రవిచంద్ర అనేకసార్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే, ఇది రాజకీయ లబ్ధికోసం నిర్వహించిన సమావేశంగా అభివర్ణించారు. అందువల్ల తమ పార్టీ తరపున ఈ సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించిన రవిచంద్ర అక్కడి నుంచి వెళ్లిపోయారు.
