హమ్మయ్య.. బీజేపీ తెలంగాణా అధ్యక్షుని‘ఎంపిక’లో ఎట్టకేలకు ఆ పార్టీ అధిష్టానం ఓ నిర్ణయాన్ని తీసుకుంది. అనేక ఊహాగానాల వార్తల నేపథ్యంలో ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామందర్ రావును తెలంగాణా రాష్ట్ర పార్టీ నూతన అధ్యక్షునిగా ‘ఎంపిక’ చేశారు. పార్టీ అధిష్టానం ఈమేరకు రామచందర్ రావుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన ఈ మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారని వార్తలు వస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ‘ఎన్నిక’ జరుగుతుందని, ఎంపీ ఈటెల రాజేందర్, రామచందర్ రావుల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనే నేపథ్యంలో వార్తలు వెలువడ్డాయి. కానీ ఎన్నికకు కాకుండా ‘ఎంపిక’కే ప్రాధాన్యతనిస్తూ ‘ఏకగ్రీవం’ లాంఛన ప్రక్రియకే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపినట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించినట్లు వార్తలు వెలువడడం ఈ సందర్బంగా గమనార్హం.
అయితే బీజేపీ అధ్యక్ష ‘ఎంపిక’లో తెరవెనుక భారీ రాజకీయ కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కొత్త అధ్యక్షునిగా ఎంపీ ఈటెల రాజేందర్ పేరు దాదాపు ఖరారైన పరిణామాల్లో పార్టీకి చెందిన పలువురు సీనియర్లు, సంఘ్ పరివార్ ఆయన ఎంపిక/ఎన్నికకు మోకాలొడ్డినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి అధ్యక్ష పదవిని ఇవ్వడానికి తాము అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పినట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈటెల రాజేందర్ పార్టీ వర్గాలతో ‘మింగిల్’ కావడం లేదని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈటెల పూర్వ ‘ఎర్ర’ నేపథ్యం సైతం కొంత అడ్డంకిగా మారిందంటున్నారు.

అంతేకాదు ఈటెల రాజేందర్ ను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టే అంశంలో ‘పార్టీ పార్లమెంటరీ బోర్డు’లోని ఒకరిద్దరు నాయకులు చక్రం తిప్పినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. బీజేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుల సంఖ్య పదిలోపే ఉంటుంది. సంస్థాగతంగా బీజేపీలో ఈ బోర్డు నిర్ణయం అత్యంత కీలకం కూడా. ఇందులో ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి, హోం మంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు వంటి ఐదుగురు కీలక నేతలు తప్పనిసరిగా ఉంటారు. ఆయా పదవుల్లో ఎవరు ఉన్నప్పటికీ వ్యక్తులు ప్రామాణికం కాకుండా ఆయా స్థానాల్లో ఉన్నవారు సభ్యులుగా ఉంటారు. గతంలో ఈ బోర్డులో నితిన్ గడ్కరీ, ఫడ్నవీస్ తదితర నేతలు కూడా ఉండేవారు. వివిధ రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక/ఎన్నికలో ఈ బోర్డు నిర్ణయం, సంఘ్ పరివార్ యోచన ప్రధానమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ కు పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించే అంశంలో ‘బోర్డు’లోని ఒకరిద్దరు నాయకులు చక్రం తిప్పినట్లు బీజేపీ కేడర్ లో చర్చ జరుగుతోంది. అయితే తెలంగాణాకు చెందిన పార్టీ సీనియర్లతోపాటు, సంఘ్ పరివార్ సైతం ఈటెల విషయంలో ఓ సూచన చేసినట్లు కూడా బీజేపీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీసీ సామాజికవర్గానికి పదవి అనే అంశమే అసలు ప్రామాణికమైతే ఈటెలను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక/ఎన్నిక చేసుకోవచ్చని సూచనప్రాయ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈటెల రాజేందర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో ‘పొత్తు’ దిశగా చేస్తున్న యోచనలో భాగంగానే ఈటెల రాజేందర్ ను అధ్యక్ష రేసు నుంచి తప్పించారనే వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా వినిపిస్తుండడం గమనార్హం. బీజేపీ తెలంగాణా కొత్త అధ్యక్షుని ‘ఎంపిక’లో ఇటువంటి అనేక ట్విస్టులు దాగి ఉన్నట్లు ఆ పార్టీలోనే రాజకీయ చర్చ జరుగుతోంది.