Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

చెప్పేదల్లా వింటున్నారా? అయితే అది ‘జోనరిజం’ కావచ్చు!

జోనరిజం (Zohnerism)
(అందరికీ తెలుసున్న వాస్తవాలను వక్రీకరించి గందరగోళ పరిచే కళ)

1997లో, 14 ఏళ్ళ విద్యార్థి నథాన్ జోనర్, ఒక సైన్స్ ఫెయిర్ లో, ప్రపంచం నిత్యం వినియోగించే ఒక రసాయనం గురించి తన సహ విద్యార్థులకు వివరించి, అత్యంత విషపూరితమైన ఆ రసాయనాన్ని నిషేధించాలని మనమంతా డిమాండు చెయ్యాలని కోరాడు.

ఆ రసాయనం పేరు డైహైడ్రోజన్ మోనాక్సైడ్ (Dihydrogen monoxide).

అతను తన ప్రసంగంలో, శాస్త్రీయంగా రుజువు చెయ్యబడిన సాక్ష్యాధారాలతో ఈ రసాయనాన్ని ఎందుకు నిషేధించాలో శ్రోతలకు వివరించాడు. అతను ఎక్కడా అసత్యం చెప్పలేదు, ఆశాస్త్రీయమైన విషయం చెప్పలేదు.

ఈ రసాయనం –

1. వాయు రూపంలో ఉన్నప్పుడు అంటుకుని తీవ్రమైన గాయాలను కలుగజేస్తుంది.

2. లోహాలు తప్పు పట్టి పాడైపోతాయి.

3. ప్రతీ సంవత్సరం అసంఖ్యాక ప్రజల మరణాలకు కారణమవుతోంది.

4. సాధారణంగా ట్యూమర్లు, ఏసిడ్ వానలు మొదలైన వాటిలో కనుపిస్తుంది.

5. ఎక్కువగా వాడితే కడుపుబ్బరంతో బాధపడాల్సి వస్తుంది. తరచుగా మూత్ర విసర్జన చెయ్యాల్సి వస్తుంది.

6. ఈ రసాయనానికి అలవాటుపడిన వ్యక్తి, చాలా కాలం ఈ రసాయనాన్ని తీసుకోక పోతే మరణిస్తాడు.

తన ప్రసంగం ముగించి జోనర్, డైహైడ్రోజన్ మోనాక్సైడ్ ను నిషేధించాలా, వద్దా అని తన సహ విద్యార్థులను అడిగాడు. 50 మందిలో 43 మంది విద్యార్థులు ప్రమాదకరమైన ఈ రసాయనాన్ని నిషేధించాలని ఓటు చేశారు.

కాని…..

ఈ రసాయనాన్ని విషపూరితంగా ప్రపంచం పరిగణించదు. ఎందుకంటే డైహైడ్రోజన్ మోనాక్సైడ్ అని జోనర్ చెప్పినది వాస్తవానికి మనం రోజూ ఉపయోగించే నీటికి చాలా అరుదుగా ఉపయోగించే మరో పేరే.

నథాన్ జోనర్ ప్రయోగ లక్ష్యం నీటిని నిషేధించడం కాదు. ప్రజలను ఎంత తేలికగా వంచించవచ్చో నిరూపించడమే.

నథాన్ జోనర్ చెప్పిన విషయాలన్నీ నూటికి నూరు పాళ్ళూ వాస్తవాలే. కొన్ని వాస్తవాలను కప్పి పుచ్చి, కొన్ని వాస్తవాలను మాత్రమే చెప్పి అతను విషయాన్నంతా వక్రీకరించి, నీరు ప్రమాదకరమైన రసాయనమని తోటి విద్యార్థులను నమ్మించగలిగాడు.

వాస్తవాల ఆధారంగానే తప్పుడు నిర్ణయాలకు వచ్చేలా పక్కదారి పట్టించే ఈ పద్ధతిని ‘జోనరిజం’ అని అంటారు.

ఈ జోనరిజం ఊహించేదాని కన్నా ఎక్కువ సందర్భాలలోనే మనకు తటస్థపడుతుంది కాని మనం గుర్తించం. రాజకీయ నాయకులూ, కుట్ర సిద్ధాంతాల గురించి చెప్పే వాళ్ళూ, వాళ్ళకు అండగా నిలిచే మేథావులూ; వార్తా పత్రికలు, టీవీ లాంటి మీడియా; పూర్తిగా వాస్తవాల మీద ఆధారపడి చెబుతూనే ప్రజలను పక్కదారి పట్టిస్తుంటారు. ప్రజలు ఇంత తేలికగా రాజకీయ నాయకుల వలలో పడిపోవడం చూస్తే దిగులు కలుగుతుంది.

కరోనా గురించి కాని, దేశ భద్రత గురించి కాని, మరే విషయం గురించి కాని మన నాయకులు, మీడియా చెప్పేది వింటున్నప్పుడు ‘జోనరిజం’ అనే పదాన్ని గుర్తుకు తెచ్చుకోండి. తిరుగులేని వాస్తవాల ఆధారంగానే మనల్ని తప్పుదారి పట్టించగలరని గ్రహించండి.

✍️ తోలేటి జగన్మోహనరావు
(M) 9908236747

Popular Articles