Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ఏంటో ఈ సిత్రం! లాజిక్ మిస్సయిన ‘కుబేర’ సీన్లు

(By Dr. Mohammed Rafee)
నేటి ట్రెండ్
హైప్ చేసి మోసం చేసి ప్రేక్షకులను రప్పించడమే!

ఒక సినిమా చెత్త అని అనడం నాకు ఇష్టం ఉండదు. కానీ, ఒకరికొకరు కలసి సక్సెస్ మీట్ పెట్టుకుంటూ ఎక్కడ లేని హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు చూడండి.. దాంతోనే నాకు పేచీ! ధనుష్ చేసిన దేవా బిచ్చగాడి పాత్ర తాను చేయలేనని, జాతీయ నటుడు గా అవార్డు గ్యారంటీ అని, రాకపోతే ఆ అవార్డులకే అర్ధం లేదని, తన జీవితంలో నాగార్జునకు పోటీ ఇవ్వలేనని స్వయంగా మెగా స్టార్ చిరంజీవి అంటే నిజమేనేమో, మిస్ అవుతానేమో అని రాత్రి ఐమాక్స్ లో కుబేర సినిమా చూశాను. పరమ చెత్త సినిమా అని చెప్పడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.

టికెట్ ధరలు పెంచి అమాంతం ఒకరినొకరు పొగుడుకుంటూ ఎక్కడలేని హైప్ తెచ్చి హాళ్ళయితే నింపుతున్నారు. నాకే నచ్చలేదా? మిగిలిన వాళ్ళకు నచ్చిందేమో అని బయటకు వస్తూ లిఫ్ట్ లో కొందరిని అడిగాను. ప్రెస్ మీట్, సక్సెస్ మీట్ లు చూసి వచ్చిన వాళ్లే అందరూ. పరమ వేస్ట్ అనేది అందరి అభిప్రాయం. సరే, పార్కింగ్ దగ్గర యువత ను అడిగాను. చెత్త మూవీ అని అందరి టాక్. మరి సక్సెస్ ఎలా అయ్యింది. హాళ్ళు ఎందుకు హౌస్ ఫుల్ అవుతున్నాయి. అనే ప్రశ్నలు ఎదురయ్యాయి.

శేఖర్ కమ్ముల ఒక బ్రాండ్. యూత్, ఫ్యామిలీ సెన్సిటివ్ మూవీలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు. అతని 25వ సినిమా కుబేర. అతని జోనర్ ను దాటి తీశాడు. కానీ, లాజిక్ మిస్ అయ్యాడు. ఫీల్ తీసుకు రాలేకపోయాడు. చాలా ప్రశ్నలు ఎదురవుతాయి చివరి వరకు.

సినిమా మొత్తం ల్యాగ్. మూడు గంటలు అవసరం లేని సినిమా. లక్షల కోట్ల అధిపతి జస్ట్ లక్ష కోట్లు లంచం ఇవ్వడానికి చార్టెర్డ్ అకౌంటెంట్లను కాకుండా జైలులో వున్న సీబీఐ ఆఫీసర్ ను ఎంపిక చేసుకోవడం ఏమిటో! తెలిసిన వాళ్ళను కాకుండా తెలియని బిచ్చగాళ్లను బినామీగా పెట్టుకోవడం ఏమిటో! మనీ ట్రాన్సఫర్ చేశాక ఏం జరిగిందో కూడా తెలుసుకోలేని వాళ్ళను లేపేయడం ఏమిటో! చెయ్యి, చదువు లేని దేవా తప్పించుకుని ముంబయి అంతా తిరుగుతున్న ఒక్క రష్మికకు తప్ప ఎవరికీ దొరకక పోవడం ఏమిటో! ఏమాత్రం సంబంధం లేని రష్మికను కథలో జొప్పించి అఖరికి డబ్బు కోసం బిచ్చగాడితో వెళ్లడం ఏమిటో! ఒక బిచ్చగత్తెను కాపాడి ఆమెకు పుట్టిన బిడ్డకు ఆస్తి ఇవ్వడం ఏమిటో! చివరకు తాను కూడా అనాధనే, బిచ్చగాడినే అని దేవాకు దీపక్ చెప్పి చనిపోవడం ఏమిటో! పది వేల కోట్ల కోసం బిచ్చగాడి చుట్టూ తిరిగిన బిలియనీర్, వాడు చెప్పినట్లుగా అడుక్కోవడం ఏమిటో! వందల మంది అతని మనుషులున్నా చెయ్యి లేనోడు అతడ్ని సింపుల్ గా చెత్తలో చంపేయడమేమిటో! ఓల్డ్ మాంక్ అని చెబితే ఫ్లాట్ కీస్ ఇవ్వడం, అందులో వేల కోట్లు, బంగారు బిస్కెట్లు ఉండటం ఏమిటో! సిన్సియర్ ఆఫీసర్ అని చెప్పుకునే దీపక్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ను చంపేయడం ఏమిటో! తెలుగు నుంచి ఒకరిని, హిందీ నుంచి ఇద్దరినీ, కన్నడ, తమిళ్, మలయాళం నుంచి ఒక్కొక్కరిని తీసుకుని పాన్ ఇండియా అనడమేమిటో! అన్నీ శేఖర్ కమ్ములకే తెలియాలి! ఇలాంటి లాజిక్ మిస్ అయిన ప్రశ్నలు ఒకటి రెండు కాదు వంద ఎదురవుతాయి ఈ సినిమాలో.

ఈ సినిమాలో నాకు నచ్చింది బిచ్చగాడికి దర్జాగా అంతిమ యాత్ర నిర్వహించిన సన్నివేశం, ఆ పాట. పాటలన్నీ బాగా రాశారు, బాగా తీశారు. మ్యూజిక్ ట్యూన్స్, బిజి కూడా కుదిరింది. ఎప్పుడైనా మనం లేచి వెళ్ళిపోయినా మధ్యలో వచ్చేశామనే బాధ ఉండదు. శేఖర్ కమ్ముల ఈ సినిమాలో అనేక క్లైమాక్స్ లు ఇచ్చి ఆ వెసలుబాటు కల్పించారు. అన్నీ ఒకే సినిమాలో చూపించాలనే శేఖర్ ఆలోచన తపన ఈ సినిమా ఫట్ అనడానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. చెత్త సినిమా అయినా జనం విరగబడి చూస్తుండటం శేఖర్ అదృష్టం, శేఖర్ ఫై వున్న అభిమానం, మరో సినిమా పోటీ లేకపోవడం కూడా అని చెప్పుకోవచ్చు.

Popular Articles