ప్రఖ్యాత సినీ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఇక లేరు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో ఈ తెల్లవారుజామున కన్ను మూశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10వ తేదీన జన్మించిన కోట శ్రీనివాసరావుకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. దాదాపు పదిహేనేళ్ల క్రితం.. 2010 జూన్ 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో కోట శ్రీనివాసరావు కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ దుర్మరణం చెందారు.
సినీ జీవితంలోకి రాకముందు కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంక్ ఉద్యోగి. తెలుగులోనేగాక తమిళం, కన్నడ, హిందీ వంటి పలు ఇతర భాషా చిత్రాల్లోనూ కోట నటించారు. నలభై ఏళ్ల సినీ ప్రస్థానంలో 750కి పైగా చిత్రాల్లో నటించిన కోట శ్రీనివాసరావు తొమ్మిది నంది అవార్డులను అందుకున్నారు. పద్మశ్రీ పురస్కారం కూడా ఆయనకు లభించింది. ‘ప్రతిఘటన’ చిత్రంలో పోషించిన పొలిటీషియన్ పాత్ర ద్వారా కోట శ్రీనివాసరావు నటునిగా బాగా పాపులర్ అయ్యారు.

