Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

నేనూ వస్తాను బిడ్డా.. ఇక్కడ బతకాలని లేదు..

నేనూ వస్తాను బిడ్డా
ఇక్కడ బతకాలని లేదు…
ఈ గుండె నీవు లేక నిలువనీయడం లేదు
కానీ..
బాధ్యతలు ఇల్లు దాట నీయడం లేదు…
అంత తొందరగా నువ్వెళ్ళి పొతే
ఇక్కడ నా జీవితం మునపటిలా ఉంటుందని ఎట్లా అనుకుంటావు?
మునుపటి పని ఉంది
మునుపటి శ్రమ ఉంది
చుట్టూ మునుపటి ప్రపంచం ఉంది
అన్నీ ఉన్నా
ఈ జీవితంలో ఏది కూడా
మునుపటిలా లేదు
అందుకే…
గడప దాటుకోవడం కోసం
పిలిచే కాలం కోసం
వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాను!

కోట శ్రీనివాసరావు గారు సంతోషంగా కాలం చేసిఉంటారు. వారి నిష్క్రమణ తట్టుకోలేక అభిమానులు దుఃఖిస్తున్నప్పటికీ.. ఆయన తన దుఃఖానికి వీడ్కోలు చెప్పి సంతోషంగా వెళ్ళిపోయి ఉంటారు.
2010లో కోట శ్రీనివాసరావుగారి కొడుకు వెంకట ఆంజనేయ ప్రసాద్‌ తన స్పోర్ట్స్‌ బైక్ ‌పై శంషాబాద్‌ వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు.
అప్పటినుండి కోట మానసికంగా చితికి పోయాడు.
సరదాగా ఏదో సినిమాల్లో కూడా నటించిన వెంకట ఆంజనేయ ప్రసాద్.. చావు సీన్లో నటించాల్సి వస్తే,
కోట ఆ సీన్ భరించలేకపోయాడు.. తిరస్కరించాడు. నటనలో కూడా కొడుకు చావును ఊహించుకోలేకపోయాడు. ఇది కన్న హృదయం! అట్లాంటిది, శాశ్వతంగా తన కొడుకు తన కళ్ళ ఎదుటే వెళ్ళిపోతే ఆ తండ్రి అనుభవించిన మానసిక క్షోభ ఎంత దారుణంగా ఉండి ఉంటుందో అక్షరాలకు అందదు..
తమ కళ్లెదుటగా తమ పిల్లల్ని కోల్పోయిన ప్రతి కన్న హృదయం వేదన ఇదే.. ఇట్లాంటి తల్లిదండ్రులకు మరణం ఓ లెక్క కాదు. పిల్లలు పోయిన తర్వాత మిగతా పిల్లల కోసం బాధ్యత కోసం బతుకుతారే తప్ప జీవితం మీద ఆశతో కాదు. వాళ్లు బతికే కాలం మొత్తం ఒక బోనస్ మాత్రమే..
ఈ సందర్భంగా
ఇది నా జీవన్మరణ స్పందన..
కోట గారికి ఆత్మీయ నివాళి
(By: డా. తంగెళ్ల శ్రీదేవిరెడ్డి)

Popular Articles