Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

ఎవరీ ACP విష్ణుమూర్తి?

సబ్బతి విష్ణుమూర్తి.. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ). తెలంగాణా పోలీసు శాఖ తరపున నిన్న సంచలనాత్మక ప్రెస్ మీట్ నిర్వహించిన పోలీసు అధికారి. బాజాప్తాగా తనను తాను ఏసీపీగా పరిచయం చేసుకుని సినీ హీరో అల్లు అర్జున్ వ్యవహార శైలిపై తనదైన శైలిలో విష్ణుమూర్తి దండెత్తారు. సంధ్య థియేటర్ లో పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన తదనంతర పరిణామాలపై, అల్లు అర్జున్ తీరుపై విష్ణుమూర్తి మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతి తెలిసిందే.

దాదాపు 45 నిమిషాలపాటు మీడియాతో మాట్లాడిన విష్ణుమూర్తి అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్ట పరిధిలో వ్యవహరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తోలు పగుల్తుందంటూ తీవ్ర స్థాయిలోనే వార్నింగ్ ఇచ్చారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించిన మరుసటి రోజే పోలీసు శాఖలో వరుస పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.

కరీంనగర్ పర్యటనలో అల్లు అర్జున్ ఉదంతంపై స్పందించిన డీజీపీ జితేందర్

తెలంగాణా పోలీస్ బాస్, డీజీపీ జితేందర్ కరీంనగర్ పర్యటనలో విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అల్లు అర్జున్ ఉదంతంపై స్పందించారు. సినిమా హీరోలైనప్పటికీ, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందేనని డీజీపీ హితవు చెప్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కూడా మీడియా సమావేశం నిర్వహించారు. సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ కదలికలు, తొక్కిసలాట పరిణామాలపై కూలంకషంగా వీడియో ప్రదర్శన నిర్వహించారు. రేవతి ప్రాణాలు కోల్పోవడానికి దారి తీసిన పరిస్థితులను పిన్ టూ పిన్ కళ్లకు కట్టినట్లు ఈ ప్రదర్శన ద్వారా మీడియా ముందుంచారు.

సంధ్య థియేటర్ ఘటనపై మీడియాతో మాట్లాడుతున్న హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర అధికారులు

ఈ పరిణామాల్లోనే ఇదేరోజు ఏసీపీ విష్ణుమూర్తి కూడా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి అల్లు అర్జున్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పోలీసు శాఖను కించపరిచే విధంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదన్నారు. విష్ణుమూర్తి ప్రెస్ మీట్ ను మెయిన్ స్ట్రీమ్ మీడియాతోపాటు ఇతరత్రా ప్రసార మాధ్యమాలు కూడా విశేష ప్రాధాన్యతనిస్తూ కవర్ చేశాయి. యూ ట్యూబ్ లో విష్ణుమూర్తి ప్రెస్ మీట్ కంటెంట్ విజువల్స్ హోరెత్తుతున్నాయి.

అల్లు అర్జున్ పై విష్ణుమూర్తి చేసిన వ్యాఖ్యలు సంచలన వార్తలుగా మారాయి. బహుషా పోలీస్ శాఖలోని ఎవరేని ఉన్నతాధికారుల ఆదేశాలతోనే విష్ణుమూర్తి అల్లు అర్జున్ పై ప్రెస్ మీట్ పెట్టి ఉంటారా? అనే ప్రశ్నలు కూడా రేకెత్తాయి. అయితే ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా, సీనియర్ అధికారికి సమాచారం ఇవ్వకుండా విష్ణుమూర్తి ప్రెస్ మీట్ నిర్వహించారని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ ఆక్షాంశ్ యాదవ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

అల్లు అర్జున్

విష్ణుమూర్తి గతంలో నిజామాబాద్ లో టాస్క్ ఫోర్స్ డీఎస్పీగా పని చేశారని, ఆ తర్వాత పరిణామాల్లో డీజీపీ ఆఫీసుకు అటాచ్ అయ్యారని, అనంతరం గత అక్టోబర్ లో సస్పెండయ్యారని పేర్కొన్నారు. విష్ణుమూర్తి నిర్వహించిన ప్రెస్ మీట్ క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించడమేనని, అతనిపై శాఖాపరమైన చర్యలకు తాము డీజీపీకి నివేదించనున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ ఆక్షాంశ్ యాదవ్ పేర్కొన్నారు.

ఆయా పరిణామాల్లో అల్లు అర్జున్ పై ప్రెస్ మీట్ నిర్వహించిన ఏసీపీ విష్ణుమూర్తి నేపథ్యం సహజంగానే చర్చకు దారి తీసింది. ఖమ్మం జిల్లా జూలూరుపాడుకు చెందిన విష్ణుమూర్తి సీపీఐ అనుబంధ ఏఐఎస్ఎఫ్ఐ లీడర్ గా పనిచేశారు. ఆ తర్వాత పోలీసు శాఖలో 1991 బ్యాచ్ ద్వారా ఎస్ఐగా చేరారు. జమ్మికుంటలో ప్రొబేషనరీ ఎస్ఐగా విధులు నిర్వహించిన విష్ణుమూర్తి సీఐ నుంచి డీఎస్పీ హోదాకు ఎదిగారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో పనిచేశారు. తన సర్వీసులో ఎక్కువగా కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని పలు కేంద్రాల్లో విధులు నిర్వహించారు.

పోలీసు శాఖ తరపున ఏదేని సమస్యపై స్పందించేందుకు వివిధ సంఘాలు ఉన్నాయి. కానిస్టేబుల్ నుంచి సీఐ స్థాయి వరకు ఓ సంఘం, డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీ వరకు మరో సంఘం, ఐపీఎస్ అధికారులకు ఇంకో సంఘం ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎస్సీ, ఎస్టీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ పేరుతో విష్ణుమూర్తి మరో సంస్థను స్థాపించి రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లు పోలీసు వర్గాలు చెబుతుండడం విశేషం. నిన్నటి ప్రెస్ మీట్ లో కూడా తాను అసోసియేషన్ తరపునే మాట్లాడుతున్నట్లు విష్ణుమూర్తి వెల్లడించారు.

Popular Articles