ఖమ్మం: ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ పలు అక్రమాలను, ఉల్లంఘనలను, అవినీతి అంశాలను గుర్తించింది. శనివారం ఆర్టీవో ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఏసీబీ యంత్రాంగం పలు ఉల్లంఘనలను, అవినీతి, అక్రమాలను గుర్తిస్తూ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆయా ప్రకటనలోని సారాంశం ప్రకారం.. ఖమ్మం ఆర్టీవో ఆపీసు ప్రాంగణంలో ఏజెంట్లు అవినీతి చర్యలకు ఆస్కారం కలిగించే విధంగా అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ ఆకస్మిక తనిఖీలు జరిపి 13 మంది ఏజెంట్లను కస్టడీలోకి తీసుకుంది. ఈ సందర్భంగా జరిపిన విచారణలో వారి వద్ద నుంచి రూ. 78,120 నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. వివిధ సేవలకోసం వచ్చిన దరఖాస్తుదారుల నుంచి ఈ మొత్తాన్ని ఏజెంట్లు వసూల్ చేసినట్లు గుర్తించింది.

అంతేగాక ఏజెంట్ల వద్ద 837 ఒరిజినల్ డ్రైవింగ్ లెసెన్సులను, వాహనాలకు సంబంధించిన ఆర్.సీ.లను కూడా గుర్తించింది. అనధికార ఏజెంట్లు అధికారిక డాక్యుమెంట్లను కలిగి ఉన్నట్లు, ఇది అవినీతికి దారితీసే తీవ్రమైన ఉల్లంఘనగానూ ఏసీబీ అధికార యంత్రాంగం గుర్తించింది. ఆర్టీవో ఆఫీసులో హాజరు, నగదు, ఇతర అధికారిక రిజిస్టర్లను సరైన రీతిలో నిర్వహించడం లేదని కూడా గుర్తించారు.
తమ విధులను నిర్వర్తించడంలో ఇక్కడి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఏజెంట్లను స్వేచ్ఛగా అనుమతిస్తూ ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకువెళ్లే విధంగా అవకాశం కల్పిస్తున్నారని, దరఖాస్తుదారులను అవినీతి చర్యలతో వేధించేందుకు సదుపాయం కల్పిస్తున్నట్లు ఏసీబీ తన ఆకస్మిక తనఖీల్లో కనిపెట్టింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై తదుపరి చర్యల కోసం పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపించనున్నట్లు ఏసీబీ పేర్కొంది. చూడాలి ప్రభుత్వం ఈ అక్రమ దందాలపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో..!

