మన తెలుగు రాష్ట్రాలకు రాజకీయాలే ప్రధానం! అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవడాలు మినహా ఇంకొకటి ఉండదు! ఇక్కడా అంతే! అక్కడా అంతే! కనీసం కళాత్మక శకటాల రేసులో కూడా లేకుండా పోయాయి. ప్రతియేటా జనవరి 26 గణతంత్ర వేడుకల్లో ఢిల్లీ ఎర్రకోట దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాన నేతలు ప్రత్యక్షంగా చూస్తూ ఉండగా, కోట్లాదిమంది ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారాల్లో తిలకిస్తుండగా ఆయా రాష్ట్రాల ప్రగతికి సంబంధించిన శకటాలు కదులుతుంటాయి! ఆ ర్యాలీ కన్నుల పండువగా ఉంటుంది. ఆయా రాష్ట్రాల అభివృద్ధి కళాత్మకత శకటాల ప్రదర్శనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. ఈ శకటాల ర్యాలీలో పాల్గొనడం అనేది ఒక ప్రతిష్టాత్మక అంశంగా అన్ని రాష్ట్రాలు తీసుకుంటాయి. ఆరు నెలల ప్రక్రియ ఇది!

ఈసారి రేసులో రెండు తెలుగు రాష్ట్రాలు లేవు! నమూనాలోనే తిరస్కరించబడ్డాయి! ఈసారి గణతంత్ర శకటాల ర్యాలీలో తెలుగు రాష్ట్రాల పేర్లు వినిపించవు. కానీ, కళాకారుల ప్రదర్శనల్లో తెలంగాణ ఒగ్గు డోళ్లు, పేరిణి డప్పు నృత్యాలు కనువిందు చేయనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తప్పెట గుళ్ళు, బుర్రకథ, కూచిపూడి కనిపించునున్నాయి. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగే శకటాల్లో మాత్రం ఈసారి వెనకబడిపోయాం. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తరువాత అయినా మన శకటాలకు ప్రత్యేక ఆకర్షణ ఉండేది! పోటీలో తప్పనిసరిగా బహుమతులు గెలుచుకునేవి! ఈసారి అంతగా శ్రద్ధ చూపించని కారణంగా రెండు రాష్ట్రాల శకటాలు ఎంపిక కాలేదు.

భారత దేశ చరిత్రలో తొలిసారి బాలీవుడ్ తన తడాఖా చూపించనున్నది! సంచలన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రసార శాఖ ప్రత్యేక శకటం రూపుదిద్దుకుంది! అలాగే మన తెలుగు తేజం, సినీ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణికి అరుదైన గౌరవం లభించింది. కీరవాణి సంగీత దర్శకత్వంలో 200 మంది గాయకులు వందేమాతరం గీతం ఆలపించనున్నారు. లీడ్ సింగర్ గా శ్రేయా ఘోషల్ వ్యవహరిస్తారు. నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి గాయకులు పాల్గొంటారు. ఈసారి ఈ రెండు విశేషాలు రేపు ఉదయం జరిగే గణతంత్ర వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు!

✍️ డా. మహ్మద్ రఫీ
