(సమీక్ష ప్రత్యేక కథనం)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సింగరేణి బొగ్గు టెండర్లకు సంబంధించి చేసిన తీవ్ర ఆరోపణలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారులు విచారిస్తున్న పరిణామాల్లో సీఎం రేవంత్ రెడ్డి బావమరిదిగా పేర్కొంటూ ఓ వ్యక్తిపై కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు. ఆ వ్యక్తిపేరు సృజన్ రెడ్డి.
సృజన్ రెడ్డి గురించి కేటీఆర్ ఏమన్నారంటే..
‘‘నిన్న ఉదయం హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి బామ్మర్ది కుంభకోణం బయటపెట్టిండు. వెంటనే సాయంత్రం వరకు హరీష్ రావుకు సిట్ నుంచి నోటీసులు ఇచ్చారు. సింగరేణి టెండరల్లో రేవంత్ రెడ్డి బామ్మర్ది కోసం నిబంధనలను మార్చారు. సృజన్ రెడ్డిని కింగ్ పిన్ గా చేసి, ఆయన చుట్టూ టెండర్లను రింగ్ చేసి, రిగ్గింగ్ చేసి మొత్తానికి తొమ్మిది టెండర్లు ఇప్పటికే పూర్తి చేశారు. సైట్ కు వచ్చి విజిట్ చేసినట్లు సర్టిఫికెట్ తీసుకోవాలనే నిబంధన విధించారు. సింగరేణి బొగ్గు టెండర్లలో బిడ్ దాఖలు చేయాలంటే సృజన్ రెడ్డితోపాటు సింగరేణి అధికారులు నిబంధన పెట్టారు. సృజన్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి బెదిరిస్తున్నడు. నేను ముఖ్యమంత్రి బావమరిదిని మాట్లాడుతున్నా, మీరు ఇందులో పాల్గొనవద్దని బిడ్డర్లను బెదిరిస్తున్నాడు. తన బెదిరింపులకు విననివారికి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. నైనీ కోల్ బ్లాక్ టెండర్ రద్దు వెనుక వాటాల పంచాయితీ ఉంది. సింగరేణిలోనూ జరుగుతున్నది ఇదే. గతంలో లెస్ టెండర్లు దాఖలు కాగా, ఇప్పుడు ఎక్సెస్ రేట్లను కోట్ చేసి టెండర్లు వేస్తున్నారు.

సృజన్ రెడ్డి కంపెనీకి రూ. 207 కోట్ల విలువైన కాంట్రాక్టులు 12 శాతం ఎక్సెస్ రేట్లకు వచ్చాయి. కంపెనీ పేరు శోధ కన్ స్ట్రక్షన్స్. ఆయన భార్య పేరు ఉంటది. సింగరేణి టెండర్లలో ఉన్న కంపెనీలకు రింగ్, ముఠా నాయకుడు సృజన్ రెడ్డి.. రేవంత్ రెడ్డి బామ్మర్ది. ఈ మొత్తం కేసులో ప్రధాన దోషి ఇవ్వాళ ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్ రెడ్డి. కోల్ కుంభకోణం ప్రధాన ముద్దాయి, కింగ్ పిన్, రింగ్ మాస్టర్ సీఎం బామ్మర్ది. అమృత్ టెండర్ల స్కాంలో కూడా ఈ ముద్దాయే భాగస్వామి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఇందులో వాటా లేకపోతే ఎందుకు స్పందిస్తలేరు? సింగరేణిని చెరబట్టారు. మైన్ టెండర్లు లెస్ నుంచి ప్లస్ లోకి ఎలా వచ్చాయి? అడ్రస్ లేని సృజన్ రెడ్డికి కాంట్రాక్టులు ఎలా వస్తున్నయ్? సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి.
మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు, విచారణ పరిణామాల నేపథ్యంలో సింగరేణి బొగ్గు టెండర్ల అంశం ప్రామాణికంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే ప్రస్తావించిన పేరు సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్దిగా పేర్కొన్న సృజన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో తెలుసా? బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి సృజన్ రెడ్డి స్వయానా అల్లుడు. కందాళ ఉపేంద రెడ్డి చిన్న కుమార్తె దీప్తిరెడ్డి భర్తే సృజన్ రెడ్డి. అయితే మీడియాతో మాట్లాడిన సందర్భంలో సృజన్ రెడ్డి పేరును కేటీఆర్ ఎన్నిసార్లు ప్రస్తావించినప్పటికీ, అన్నిసార్లు సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్దిగానే అతన్ని ఉటంకించారే తప్ప, తమ పార్టీకి చెందిన కందాళ ఉపేందర్ రెడ్డి అల్లుడనే విషయాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.

పాలేరు నుంచి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కందాళ ఉపేందర్ రెడ్డి ఆ తర్వాత పరిణామాల్లో బీఆర్ఎస్ లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో కందాళ ఉపేందర్ రెడ్డి ఇంటి అల్లుడైన సృజన్ రెడ్డిని ‘టార్గెట్’గా ఎంచుకుని కేటీఆర్ ఆయనను పదేపదే సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్దిగా పేర్కొంటూ చేస్తున్న ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. ఇంతకీ సృజన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి బామ్మర్ది ఎలా అయ్యారో దిగువన గల లింక్ ద్వారా పూర్తి కథనంలో తెలుసుకోవచ్చు..

