Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ఎంపీ వద్దిరాజు స్ట్రాంగ్ కౌంటర్

కొత్తగూడెం: బీఆర్ఎస్ పార్టీని చూసి సీఎం రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతుండడాన్ని తట్టుకోలేక సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి హోదాలో గల నాయకుడు విపక్ష బీఆర్ఎస్ గద్దెల్ని కూల్చేయాలంటూ హింసను ప్రోత్సహించేవిధంగా పిలుపునివ్వడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. కొత్తగూడెంలోని పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పడిన బకాయిల కార్డు (బాకీ కార్డ్)లను, పార్టీ మునిసిపల్ ఎన్నికల స్టిక్కర్లను వద్దిరాజు విడుదల చేసి బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర, పార్టీ ఎన్నికల ఇంఛార్జి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నాయకులు నెరవేర్చడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నకు రూ. 76,000 కోట్లు, ఆడబిడ్డలకు రూ. 62,500 కోట్లు, వృద్ధులు, దివ్యాంగులకు రూ. 50,000 కోట్ల చొప్పున బకాయి పడిందని ఎంపీ వద్దిరాజు వివరించారు.

అదేవిధంగా కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీల పంపిణీ, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఇస్తామన్న తులం బంగారం జాడ లేదన్నారు. కౌలురైతులు, ఆటో కార్మికులు, నిరుద్యోగ యువతకు చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ పాలనను అన్ని వర్గాల ప్రజలు చీదరించుకుంటున్నారని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. పార్టీ ప్రచురించిన డోర్ స్టిక్కర్లు, బాకీ కార్డులను గడపగడపకు అంటించి, ప్రతి ఓటరుతో మమేకమై కాంగ్రెస్ సర్కార్ తప్పిదాలను వివరిద్ధామన్నారు.

ఇటీవల రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 40% పైగా సర్పంచులను గెలిపించుకున్నామని, ఈ ఉత్సాహంతో మనమందరం ముందుకు సాగుదామని ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పుడొచ్చినా, ఆ తర్వాత జరిగినా, ఎప్పుడొచ్చినా కూడా మొత్తం 60 డివిజన్లలో బీఆర్ఎస్ విజయఢంకా మోగించడం ఖాయమని ఎంపీ వద్దిరాజు ధీమాను వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది ఉత్సాహంతో ముందుకు వస్తున్నారని, గులాబీ కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన వివరించారు.

పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చే వారంతా పార్టీ జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సర్వే వివరాల ఆధారంగా అభ్యర్థిత్వం ఖరారు చేయడం జరుగుతుందని ఎంపీ రవిచంద్ర తెలిపారు. ప్రజలతో నిత్య సంబంధాలు కలిగిన, పలుకుబడి ఉన్న వారికి ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు నిర్ణయించిన నాయకులకు అభ్యర్థిత్వం లభిస్తుందన్నారు. బీఆర్ఎస్ లో గ్రూప్ రాజకీయాలకు తావులేదన్నారు. వనమా వెంకటేశ్వర రావు, రేగా కాంతారావు, రవిచంద్రలకు ఎలాంటి వ్యక్తిగత ఏజెండా లేదని, అందరూ కూడా పార్టీ అధినేత కేసీఆర్ గ్రూప్ వారేనని స్పష్టం చేశారు.

పార్లమెంట్ సమావేశాలు కూడా మొదలవుతున్నందున ముఖ్యమైన సందర్భాల్లో ఒకటి రెండు సార్లు ఢిల్లీ వెళ్లి వస్తానని, 24 గంటలు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటానని ఎంపీ రవిచంద్ర చెప్పారు. ఈ మునిసిపాలిటీలో తిరిగి గులాబీ జెండా ఏగురవేసేందుకు మనమంతా మరింత క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగుదామని ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులకు రవిచంద్ర, కాంతారావు,వెంకటేశ్వర రావులు స్టిక్కర్లు, బాకీ కార్డులు,ఓటర్ల జాబితాలు అందజేశారు.

Popular Articles