Top 5 This Week

Related Posts

వే(ఆ)టగాడి తుపాకులు సీజ్, లైసెన్స్ రద్దు!

కొత్తగూడెం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి జింకల పార్కులో దుప్పులను వేటాడిన కేసులో అరెస్టయిన మెచ్చా రఘు తుపాకులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు సీజ్ చేశారు. అంతేకాదు అతనికి గల రెండు తుపాకుల లైసెన్సుల రద్దుకు కూడా సిఫారసు చేశారు. ఈమేరకు మెచ్చా రఘు తుపాకీ లైసెన్సులను రద్దు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు పోలీసులు లేఖ కూడా రాశారు. తుపాకుల సీజ్, లైసెన్స్ రద్దుకు సిఫారసు చేస్తూ కలెక్టర్ కు లేఖ రాసిన అంశాన్ని పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ ‘సమీక్ష’ న్యూస్ తో ధ్రువీకరించారు.

అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్ రావు సోదరుని కుమారుడైన మెచ్చా రఘును వన్యప్రాణుల వేట కేసులో ఈనెల ఈనెల 5వ తేదీన ఖమ్మం అటవీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రఘుతోపాటు మరో ముగ్గురిని కూడా ఫారెస్ట్ అధికారులు ఇదే కేసులో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, మొత్తం నలుగురు నిందితులు ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సత్తుపల్లి దుప్పుల వేట కేసులో ప్రధాన నిందితునిగా భావిస్తున్న మెచ్చా రఘు ‘స్పోర్ట్స్’ కోటాలో తుపాకీ లైసెన్సులను పొందారు. అయితే ఈ లైసెన్సుడ్ తుపాకులను వన్యప్రాణుల వేటకు వినియోగించినట్లు ఆరోపణలు ఎదుర్కుని రఘు అరెస్ట్ కావడం గమనార్హం.

Popular Articles