సికింద్రాబాద్: కారు సీటు కింద దాచి రూ. 4.05 కోట్ల నగదును తరలిస్తుండగా సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఈ మొత్తాన్ని హవాలా సొమ్ముగా భావిస్తున్నారు. రూ. 50.00 లక్షలు ఇస్తే మరో పది లక్షలు ఆన్ లైన్ ద్వారా అందిస్తానంటూ మోసం చేసి తప్పించుకుంటున్న గ్యాంగ్ ఈ ఘటనలో పట్టుబడడం విశేషం.
వివరాల్లోకి వెడితే.. ఓ వ్యాపారి తనకు అధిక డబ్బు ఇస్తానిని యాభై లక్షల మొత్తంతో ఉడాయించాడంటూ బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ప్రయాణిస్తున్న వాహనం మహబూబ్ నగర్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకుల పోలీసులకు సమాచారం అందించారు. వారి సహాయంతో చెక్ పోస్టు ఏర్పాటు చేయించి అక్కడికి చెరుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న ప్రకాశ్, ప్రగ్నేష్ లను అదుపులోకి తీసుకుని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఆ తర్వాత కారు మొత్తం తనీఖీ చేసినా డబ్బు కనిపించలేదు. చివరికి కారు ముందు సీటును నిశితంగా పరిశీలించగా, సీటు కింద ప్రత్యేకంగా ఓ బాక్సును తయారు చేయించినట్లు కనిపించింది. అందులో వెతకగా డబ్బును సీటు కింద బాక్సులో దాచి ఉంచినట్లు గుర్తించారు. ప్రత్యేక బాక్సును ఓపెన్ చేసి మొత్తం నాలుగు కోట్ల ఐదు లక్షల రుపాయలను పోలీసులు స్వాధీనం చెసుకున్నారు. ఈ మొత్తం హవాలా మనీగా భావిస్తున్నారు. ఐటీ శాఖ అధికారులకు డబ్బును అప్పజెప్పడంతో పాటు నిందితులిద్దరిని బోయినపల్లి పోలీసులు ఆరెస్ట్ చేశారు.

