జస్టిస్ సుదర్శన్ రెడ్డి మన తెలంగాణ బిడ్డ. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి. దుర్మార్గమైన సల్వాజుడుం రద్దు కావడానికి కీలక తీర్పు ఇచ్చిన న్యాయ కోవిదుడు. తన పరిధిలో తెలంగాణ రాష్ట్రం కోసం తండ్లాడినోడు. ఇంత పెద్ద దేశంలో.. రెండో అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతి పదవికి నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు ఇండియా కూటమి. బీజేపీ విధానాలతో దేశానికి నష్టమని భావించి ఏకమైన ఎన్నో రాష్ట్రాల ఎన్నో పార్టీల సమూహం. అటు వైపు పోటీలో రాధ కృష్ణన్ ఉన్నా అమిత్ షా తోటే పోటీ అన్నట్టు తయారైంది.
ఇలాంటి కీలక సమయంలో.. తెలంగాణ కోసమే పుట్టినం అని చెప్పుకునే బీఆర్ఎస్.. మన సుదర్శన్ రెడ్డికి ఓటు వేయక పోవడం చారిత్రక తప్పిదం. దేశమంత ఎన్నో పార్టీలు సపోర్టు చేస్తుంటే మనోడికి మన రాష్ట్రం పార్టీ దూరంగా ఉండడమంటే తెలంగాణ మట్టితో బంధం తెంచుకోవడం లాంటిదే. యూరియా సప్లై చేయాల్సింది కేంద్రం. ఐనా అదో సాకుగా చూపి ఎలక్షన్లకు దూరం ఉంటున్నరు. నిజంగా రైతుల కోసమైతే యూరియా ఇవ్వని కేంద్రానికి వ్యతిరేకంగా ఓటెయ్యాలికదా..? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూనే మా తెలంగాణ బిడ్డకు మేం కాకుంటే ఇంకెవ్వలు సపోర్ట్ చేస్తరు అని బీఆర్ఎస్ ఓటేస్తే.. మస్తు పతార పెరుగుతుండే.

అప్పుడు పార్లమెంట్ల తెలంగాణ బిల్లు పాస్ కావడానికి కారణమైన దళిత బిడ్డ మీరా కుమార్ ఆ తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆమెకు వ్యతిరేకంగా.. బీజేపీ అభ్యర్థి రాంనాథ్ కోవింద్ కు ఓటేశింది టీఆర్ఎస్. మరి అప్పుడే కండీషన్ తోటి సపోర్ట్ చేశిండ్రో చెబితే బాగుండే. అట్లనే నోట్ల రద్దు, జీఎస్టీకి కూడా. పదేండ్లలో ఎన్నడు ఏ షర్తు పెట్టనోళ్లు ఇప్పుడెందుకు పెట్టినట్టు..? పార్టీ పేరులో తెలంగాణ తీశేశిండ్రు.. తెలంగాణ వ్యక్తులకన్న ఇమ్మతి ఇయ్యాల్సుండే.
పచ్చి సమైకవాది.. ఎన్నడు జై తెలంగాణ అనని పీవీ నరసింహ రావును.. ఐదేళ్ల నుంచి పీవీ తెలంగాణ ఠీవీ అని భుజాల మీద మోశేటోళ్లకు.. పక్కా తెలంగాణ వాది జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సపోర్టు చేయకపోవడం పచ్చి అవకాశవాద రాజకీయం.
బలవంతుడు బలహీనుడు కొట్లాడుతుంటే.. నేను ఎవరి వైపు ఉండను అనడమంటే బలవంతుడికి బలం ఇవ్వడమే.
జై తెలంగాణ.. ✊
– రఘు భువనగిరి

