హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్, పరిస్థితిపై తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కకావికలమైందని, ఆ పార్టీ ఒకటా? రెండా? ఎన్ని ముక్కలువుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో సోమవారం జరిగిన పీసీసీ విస్తృత సమావేశంలో భట్టి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ, మండల స్థాయిలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న వారిని ఉద్యమంలా చేర్చుకోవాలని పార్టీ నాయకులకు, శ్రేణులు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి అందరం కలిసి పని చేద్దామని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం దేశానికి అవసరమన్నారు. ఎన్నికల ముందు పని చేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ లేదా ప్రభుత్వ పదవి ఏదో ఒకటి తప్పకుండా వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అజేయంగా ఉండేందుకు పీసీసీ అధ్యక్షుడు చేపట్టే ప్రతీ పనికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు యావత్ క్యాబినెట్ అండగా ఉంటుందన్నారు.

ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చాక కేవలం సంక్షేమ కార్యక్రమాలకు రూ. 99,529 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా రోడ్లన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అందించేందుకు సవాళ్లను ఎదుర్కొని న్యాయం చేసేందుకు ముందుకు వెళ్తామని, స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ పరిమితిని బీఆర్ఎస్ పెట్టిందని, 42 శాతం రిజర్వేషన్ బిల్లును బీజేపీ రాష్ట్రపతి దగ్గర ఆపిందన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్, బీజేపీల కుట్ర దాగి ఉందన్నారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కవిత స్పష్టంగా చెప్పిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దశాబ్ద కాలం పాటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, విజయగర్వంతో కామారెడ్డిలో నిర్వహించే భారీ సభను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు కదం తొక్కలని ఆయన పిలుపునిచ్చారు.

