సీపీఎం పత్రిక ‘నవ తెలంగాణ’ దశాబ్ధి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డికి ‘రెడ్ కార్పెట్’ స్వాగతం లభిస్తోంది. ఈ పరిణామం తెలంగాణాలో రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారి తీస్తుండడం విశేషం. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ‘ప్రజాశక్తి’గా ఉన్నటువంటి సీపీఎం పత్రిక ఆ తర్వాత ‘నవ తెలంగాణ’గా పేరు మారిన సంగతి తెలిసిందే. ఈ పత్రిక ఇప్పుడు 11వ వసంతంలోకి అడుగిడిన తర్వాత 163వ సంచిక విడుదల రోజుప పదేళ్ల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఆగస్టు 1వ తేదీన హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అట్టహాసంగా 10వ వార్షికోత్సవ సభను ఏర్పాటు చేశారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, అతిథులుగా రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ప్రియాంక, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, నవ తెలంగాణ సాహితీ సంస్థ ఇంఛార్జి తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరవుతున్నారు. సాధారణంగా పత్రికల వార్షికోత్సవాలకు సీఎం స్థాయి నాయకుడే కాదు, మంత్రులు, ఇతర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరుకావడం సహజమే కావచ్చు. కానీ ఓ పార్టీకి అనుబంధంగా నడుస్తున్న పత్రిక వార్షికోత్సవానికి, అందులోనూ గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీతోనే కలిసి నడిచిన సీపీఎం తన పత్రిక పదేళ్ల పండుగకు సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడమే ఆసక్తికర రాజకీయ చర్చకు తావు కల్పించింది.

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకున్న సోదర సీపీఐ పార్టీకి అసెంబ్లీలోనే కాదు, శాసనమండలిలోనూ ప్రాతినిధ్యం లభించింది. కానీ సీపీఎం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ పార్టీతోనూ, ఇటు కాంగ్రెస్ తోనూ పొత్తు కుదుర్చుకోలేదు. ఫలితంగా ప్రస్తుత అసెంబ్లీలోనేకాదు, శాసన మండలిలిలోనూ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ‘నవ తెలంగాణ’ పత్రిక పదో వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డిని సీపీఎం పత్రిక నిర్వాహకులు ఆహ్వానించడం సహజంగానే రాజకీయ చర్చకు దారి తీసింది. పత్రిక వార్షికోత్సవానికి సీఎం స్థాయి నాయకున్ని ఆహ్వానించడం విశేషం కాకపోవచ్చు, కానీ ఆ పత్రిక యజమాని ‘నవ తెలంగాణ’ సాహితీ సంస్థ. ఆ సంస్థకు ఇంఛార్జి కాకలుతీరిన మార్క్సిస్టు లీడర్ తమ్మినేని వీరభద్రం. అదీ గమనించాల్సిన అంశమనేది పరిశీలకుల వాదన.

ఈ నేపథ్యంలో రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్న ఆసక్తికర చర్చ ఏమిటంటే.. నవ తెలంగాణా పత్రిక వార్షికోత్సవానికి సీఎంను ఆహ్వానించడం ద్వారా ప్రభుత్వానికి సీపీఎం దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుండవచ్చు.. ఈ యత్నం సఫలీకృతమైతై వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఎం మధ్య రాజకీయ ‘పొత్తు’ కుదరవచ్చు. లేదంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ప్రకటనలకు నోచుకోని ‘నవ తెలంగాణ’ పత్రికకు కాంగ్రెస్ హయాంలో ప్రకటనల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరవచ్చు. ఈ రెండిటిలో ఏది జరిగినా అంతిమంగా అది సీపీఎంకే ప్రయోజనంగా మారవచ్చుననేది పరిశీలకుల భావన. మొత్తంగా ‘నవ తెలంగాణ’ పత్రిక పదేళ్ల పండుగకు ముఖ్య అతిథిగా ఆహ్వానించిన నేపథ్యంలో కార్యక్రమానికి వేదికగా మారిన సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని ముస్తాబు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు.

కాగా పదేళ్ల పండుగను జరపుకుంటున్న సీపీఎం పత్రిక ‘నవ తెలంగాణ’కు సీఎం రేవంత్ రెడ్డి లేఖ ద్వాారా ఇప్పటికే శుభాకాంక్షలు తెలిపారు. ‘ ప్రజల పక్షంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నడుస్తున్న నవతెలంగాణ దినపత్రికకు పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు. నవతెలంగాణ పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ప్రజలు పాఠకులు, అన్ని వర్గాలు రాబోవు కాలంలో మరింత సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నాను. లాభాపేక్ష లేకుండా జర్నలిస్టు విలువలను కాపాడుతూ ప్రజల గొంతుకగా నిలుస్తున్న నవతెలంగాణ దినపత్రిక దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలని కోరుకుంటున్నాను’ అని సీఎం లేఖ ద్వారా సందేశాన్ని పంపారు.

