Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

సీపీఆర్వోగా నాన్ జర్నలిస్ట్.. సీఎం రేవంత్ లెక్కలేంటి!?

తెలంగాణా సీఎం సీపీఆర్వో (చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్)గా గుర్రం మల్సూర్ నియమితులయ్యారు. కాంట్రాక్టు ప్రాతిపదికన ఇతన్ని సీఎం సీపీఆర్వోగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వు జారీ చేశారు. మల్సూర్ ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్-1 అధికారిగా నియమితులై బీసీ, గిరిజన సంక్షేమ శాఖల్లోనేగాక ఇంకా అనేక ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారు. బీఆర్ఎస్ హయాంలో టీజీఎండీసీ వైఎస్ ఛైర్మెన్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గానూ పనిచేశారు. గత నెలాఖరున ప్రభుత్వ అధికారిగా ఆయన పదవీ విరమణ చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడేనికి చెందిన మల్సూర్ రిజిస్ట్రేషన్ శాఖలో అదనపు రిజిస్ట్రార్ గా ఉన్నప్పటికీ, ఆ శాఖలో మాత్రం ఆయన ఎన్నడూ విధులు నిర్వహించలేదని ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఇదీ సీఎం సీపీఆర్వో మల్సూర్ కు సంబంధించిన క్లుప్త నేపథ్యం.

అయితే సాధారణంగా సీఎం సీపీఆర్వోలుగా ప్రధానంగా జర్నలిస్టులే నియామకం అవుతుంటారు. జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం, పేరుగాంచిన జర్నలిస్టులను మాత్రమే పలువురు సీఎంలు ఇందుకు ఎంచుకుంటారు. దీనికి కారణాలు అనేకం. ముఖ్యంగా ప్రభుత్వ వ్యవహారాలపైనేగాక, సీఎం పరిపాలనా తీరుపై సీపీఆర్వోల ఫీడ్ బ్యాక్ నే పాలకులు ఎక్కువగా విశ్వసిస్తుంటారనేది ప్రతీతి. ఓరకంగా సీఎంకు సీపీఆర్వో కళ్లు, చెవులు, ముక్కుగా భావిస్తుంటారు కూడా. నిజానికి పూర్వకాలపు కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి సీపీఆర్వో అనే పోస్టుకు పెద్దగా ప్రాముఖ్యత కూడా లేదు. ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు వరకు సీపీఆర్వోల ప్రాధాన్యత బాగా పెరిగిందనే చెప్పాలి. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నకాలంలో ఆయన సీపీఆర్వోగా గోటేటి రామచందర్ రావు అనే వ్యక్తి వ్యవహరించారు. గోటేటి స్వతహాగా జర్నలిస్టు కాకపోయినా, సాహిత్యపరంగా ఆయనకు గల పేరు, ప్రఖ్యాతులు సీపీఆర్వోగా ఆయనకు అవకాశం కల్పించాయని అప్పట్లో చెబుతుండేవారు.

ఆ తర్వాత చంద్రబాబునాయుడి కాలంలో విజయ్ కుమార్ అనే ప్రభుత్వ అధికారి సీపీఆర్వోగా వ్యవహరించినప్పటికీ, అసలు పీఆర్వోగా ఓ ప్రముఖ పత్రికకు చెందిన జర్నలిస్టే బహుళ ప్రాచుర్యంలో ఉండేవారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో చంద్రశేఖర్ రెడ్డి అనే ప్రభుత్వ అధికారి సీపీఆర్వోగా వ్యవహరించారు. బేసిక్ గా చంద్రశేఖర్ రెడ్డి జర్నలిస్టే.. ఉదయం పత్రికలో ఆయన పనిచేశారు. కానీ ఆయనను ఓ ప్రభుత్వ విభాగంలోకి ఉద్యోగిగా తీసుకున్న తర్వాతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన సీపీఆర్వోగా నియమించుకున్నారు.

కేసీఆర్ తో గటిక విజయ్ కుమార్

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానంతరం కేసీఆర్ సీఎం అయ్యాక సీఎం పీఆర్వో వింగ్ అత్యంత వివాదాస్పదరీతిలో ప్రచారాన్ని మూగట్టుకుందనే చెప్పాలి. వాస్తవానికి కేసీఆర్ హయాంలో సీపీఆర్వోగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి పేరు జ్వాలా నరసింహారావు. సాహిత్యపరంగా నిష్ణాతునిగా పేరుగాంచిన జ్వాలా నరసింహారావు గ్రంథాలయ సంస్థ ఉద్యోగిగా ఉంటూనే ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరించిన కుముద్ బెన్ జోషి దగ్గర విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో పని చేశారు. సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టాక ఆయన వద్ద సీపీఆర్వోగా నియమితులయ్యారు. సీపీఆర్వోగా పేరుకే జ్వాలా నరసింహారావు ఉన్నప్పటికీ, పెత్తనమంతా పీఆర్వో గటిక విజయ్ కుమార్ చేశాడనే పేరు ఉండనే ఉంది. అత్యంత వివాదాస్పద రీతిలో పీఆర్వో ఉద్యోగం నుంచి కేసీఆర్ చేత గెంటివేయబడ్డ గటిక విజయ్ కుమార్ జర్నలిస్టే అయినప్పటికీ, అక్కడ ఆయన వ్యవహరించిన తీరుపై వచ్చిన తీవ్ర ఆరోపణలు తెలంగాణా సమాజానికి తెలిసినవే.

సీఎం రేవంత్ రెడ్డితో బోరెడ్డి అయోధ్యరెడ్డి

ఇక తెలంగాణా రెండో సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాక అప్పటి వరకు గాంధీభవన్ లో పనిచేసిన జర్నలిస్ట్ బోరెడ్డి అయోధ్యరెడ్డి సీపీఆర్వోగా నియమితులయ్యారు. ఇటీవలే ఆయన ఆర్టీఐ కమిషనర్ గా నియమితులయ్యాక, గడచిన కొన్ని రోజులుగా సీపీఆర్వో పోస్టు ఖాళీగానే ఉంది. ఈ పోస్టుకోసం అనేక మంది జర్నలిస్టులు తమ శక్తియుక్తులను ధారపోసి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఈసారి ఈ పోస్టులో జర్నలిస్టు నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి మల్సూర్ వైపే ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపడంపైనే జర్నలిస్ట్ సర్కిళ్లలో తీవ్ర చర్చ జరుగుతోంది. బేసిక్ గా జర్నలిస్ట్ కాకపోయినప్పటికీ, విధినిర్వహణపరంగా మల్సూర్ సమర్థతపై ఆయన గురించి తెలిసినవారెవరికీ ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే..?

కేసీఆర్ తో జ్వాలా నరసింహారావు

మల్సూర్ ప్రభుత్వ ఉద్యోగిగా అనేక కీలక బాధ్యతలను నిర్వహించారు. ముఖ్యంగా చంద్రబాబునాయుడి హయాంలో ప్రపంచ బ్యాంక్ లైజనింగ్ ఆఫీసర్ గా పని చేశారని ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు సైతం మల్సూర్ సర్కారు ఉద్యోగిగా అత్యంత సన్నిహితంగా ఉండేవారని తెలుస్తోంది. ముఖ్యంగా టీజీఎండీసీ వైస్ చైర్మన్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గా బీఆర్ఎస్ ప్రభుత్వానికి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చేవారని పేరుంది. ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయ, వనరులను పెంపొందించే అంశాల్లో ఉపయుక్త సలహాలు, సూచనలు ఇస్తుంటారని మల్సూర్ ప్రాచుర్యం పొందారు.

తన నియామకం తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మల్సూర్

ఈ నేపథ్యంలోనే అన్ని కోణాల్లో ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి మల్సూర్ ను సీపీఆర్వోగా నియమించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మల్సూర్ మేథాశక్తి, ఆలోచనలు, సలహాలు, సూచనలు ప్రస్తుత ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను పెంపొదిస్తాయనే అంచనాతో ఆయనను సీఎం సీపీఆర్వోగా నియమించారనే వాదన వినిపిస్తోంది.

Popular Articles