తెలంగాణాలో భూ సమస్యలను వచ్చే ఆగస్టు నాటికి పరిష్కరిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భూ భారతి చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఈనెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అధికారులే ప్రజల వద్దకు వస్తారని, రెవెన్యూ వ్యవస్థ గ్రామాలకే తరలివచ్చి ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు.
పేదల్లో నిరుపేదలకు ముందుగా ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చామని మంత్రి చెప్పారు. వందకు వంద శాతం అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ళు పూర్తి చేసుకునే లోపే రెండో విడత ఇళ్లు ఇస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సన్నబియ్యం ఇచ్చామని, కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని చెప్పారు. కొద్ది రోజుల్లోనే రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు. ఇది పేదల ప్రభుత్వమని, వారికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.



