వారిద్దరూ ఐఏఎస్ అధికారులు. ఇందులో ఒకరు ఖమ్మం జిల్లా కలెక్టర్ గా పనిచేస్తుండగా, మరొకరు ఖమ్మం మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరు అధికారులు మంగళవారం నగరంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ సెంటినరీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. సాధారణంగా ఉన్నతాధికారులు తనిఖీ చేస్తే అది అంతగా ప్రాముఖ్యత గల వార్త కాకపోవచ్చు. ఇందుకు భిన్నంగా వ్యవహరించడమే ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారుల ప్రత్యేకత.

కళాశాలకు తనిఖీ కోసం వెళ్లిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు విద్యార్థులు బ్యాండ్ మేళంతో స్వాగం చెప్పారు. విద్యార్థుల యోగక్షేమాలు కనుక్కున్న ఈ ఐఏఎస్ అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత నేలపై కూర్చుని వారికి టీచర్లు కూడా చెప్పని జీవిత పాఠాలను బోధించారు. మొక్క రూపంలో ఉన్నపుడే సరైన ఎరువులు వేస్తేనే అవి చెట్లుగా ఎదుగుతాయని, ఇందుకు అనుగుణంగానే విద్యార్థులు ఎదగాలని సూచించారు. పక్కనే కుర్చీలు ఉన్నప్పటికీ, నేలపైనే కూర్చుని మున్సిపల్ కమిషనర్ తో కలిసి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ విద్యార్థులకు చెప్పిన విలువైన పాఠాలను దిగువన గల వీడియోలో చూడవచ్చు.

