జనతన సర్కార్ పేరుతో ఛత్తీస్ గఢ్ లోని తమ ప్రాబల్య ప్రాంతాల్లో పోటీ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జనతన సర్కార్ లో భాగస్వామ్యంగా ఉన్న వివిధ హోదాల్లో గల వారు సహా మొత్తం 103 మంది నక్సలైట్లు గురువారం బీజాపూర్ జిల్లా పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో DVCM-01, PPCM-04, ACM-04, ప్లాటూన్ పార్టీ సభ్యుడు-01, DAKMS అధ్యక్షులు-03, CNM అధ్యక్షులు-04, KAMS అధ్యక్షులు-02, ఏరియా కమిటీ పార్టీ సభ్యులు-05, మిలిషియా కమాండర్/డిప్యూటీ కమాండర్లు-05, జనతాన సర్కార్ అధ్యక్షులు-04 చొప్పున ఉన్నారు.
అదేవిధంగా PLGA సభ్యుడు-01, CNM సభ్యులు-12, జనతన సర్కార్ ఉపాధ్యక్షులు-04, DKMS ఉపాధ్యక్షుడు-01, జనతన సర్కార్ సభ్యులు-22, మిలిషియా ప్లాటూన్ సభ్యులు-23, GPC-02, DKMS సభ్యులు-04, భూమ్కాల్ మిలిషియా సభ్యుడు-01 సహా మొత్తం 103 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన ఆయా నక్సల్స్ లోని 49 మంది మావోయిస్టుల తలలపై రూ. కోటి ఆరు లక్షల 30 వేల నగదు రివార్డు ఉంది. పోలీసులకు లొంగిపోయిన వారిలో RPC సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం.
ఛత్తీస్ గఢ్ లోని నక్సల్స్ అణచివేతపై ప్రస్తుత పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో ఇంత భారీ సంఖ్యలో నక్సల్స్ ప్రభుత్వానికి లొంగిపోయినట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వానికి లొంగిపోయిన నక్సల్స్ లో ఒక్కొక్కరికి రూ. 50 వేల నగదు చెక్కులను పోలీసు అధికారులు ప్రోత్సాహకంగా అందించారు. కాగా గత జనవరి నుంచి ఇప్పటివరకు ఛత్తీస్ గఢ్ లో 421 మంది నక్సల్స్ ను పోలీసులు అరెస్ట్ చేయగా, 410 మంది ప్రభుత్వానికి లొంగిపోయారు. అదేవిధంగా పలువురు కీలక నేతలు సహా 137 మంది నక్సల్స్ ఎన్కౌంటర్ లో చనిపోయారు.