హైదరాబాద్: బంజారాహిల్స్ కేంద్రంగా నిర్వహిస్తున్న ‘స్వతంత్ర’ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి తెలంగాణా కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ ఛానల్ కు చెందిన ఉద్యోగులు కె. నవీన్ కుమార్, సీహెచ్. దొరబాబు చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ -2 డిప్యూటీ లేబర్ కమిషనర్ (డీసీఎల్) బి. జాసన్ ఈ నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదుదారులతో ఈనెల 23వ తేదీన మధ్యాహ్నం 3.00 గంటలకు నిర్వహించే జాయింట్ మీటింగ్ కు హాజరు కావలసిందిగా ఆయన న్యూస్ ఛానల్ యాజమాన్యాన్ని ఆదేశించారు.
ఇదీ చదవండి:
సమస్య పరిష్కారం కోసం అవసరమయ్యే డాక్యుమెంట్లను తీసుకుని మీటింగ్ కు హాజరు కావాలని డీసీఎల్ జాసన్ స్వతంత్ర ఛానల్ యాజమాన్యాన్ని నిర్దేశించారు. మరో కేసులో ఇదే న్యూస్ ఛానల్ కు ఖమ్మం లేబర్ కోర్టు డిప్యూటీ కమిషనర్ విజయ భాస్కర్ రెడ్డి గత అక్టోబర్ నెలాఖరున జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ‘ది పయనీర్’ ఆంగ్ల దినపత్రికను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తూ, రెసిడెంట్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఇదే న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ బి. కృష్ణప్రసాద్ పై బాస రాజనరసింగరావు అనే ఉద్యోగి కూడా రాష్ట్ర లేబర్ కమిషనర్ కు, జాతీయ మానవహక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే స్వతంత్ర ఛానల్ ఉద్యోగులు కె. నవీన్ కుమార్, సీహెచ్. దొరబాబు తాజాగా కార్మిక శాఖను ఆశ్రయించడం మీడియా సర్కిళ్లలో చర్చనీయాంశంగా మారింది. తమకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయా ఉద్యోగులు కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ను ఆశ్రయించి ఈ ఫిర్యాదులు చేయడం గమనార్హం.

