వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డిలను అరెస్టు భయం వెంటాడుతోంది. తమను పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉందని, తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు నమోదు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టయిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో పోసాని తన నేరాంగీకార పత్రం (కన్ఫెషన్ స్టేట్మెంట్)లో సజ్జల రామకృష్ణారెడ్డి పేరును, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి పేరు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం తాను మీడియా సమావేశాల్లో మాట్లాడితే, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ భార్గవ్ రెడ్డి ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసేవాడని పోసాని కృష్ణమురళి తన నేరాంగీకార పత్రంలో పేర్కొన్నట్లు వార్తల సారాంశం.

ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తమ ఇద్దరి పేర్లను పోసాని పోలీసులకిచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంటులో చెప్పారని, కానీ తాము అమాయకులమని, అనవసరంగా తమను ఈ కేసులోకి లాగుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డిలు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. రాజకీయ ప్రతీకారంలో భాగంగా తమను ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని, తమకు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో శాశ్వత నివాసాలున్నాయని, తాము తప్పించుకునిపోయే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారుల ముందు హాజరవుతామని, ఆయ అంశాలను పరిగణనలోకి తీసుకుని తమకు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును అభ్యర్థించారు.