ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ ఆకస్మికంగా మృతి చెందారు. గుండెపోటు కారణంగా హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానంతరం 2014లో ఆయన వైరా నుంచి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరిన మదన్ లాల్ 2018, 2023 ఎన్నికల్లోనూ తిరిగి వైరా నుంచి పోటీ చేసి విజయం సాధించలేకపోయారు. ఈర్లపూడి గ్రామ సర్పంచ్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మదన్ లాల్ ప్రస్తుతం వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు.
మదన్ లాల్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తదితరులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.