Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ఆర్మీ జవాన్ పై ఖమ్మం పోలీసుల సంచలన ప్రకటన

ఆర్మీ జవాన్ ఒకరిపై ఖమ్మం జిల్లా వైరా ఏసీపీ రహమాన్ శనివారం సంచలన ప్రకటన విడుదల చేశారు. చింతకాని మండలం నాగులవంచ పెట్రోల్ బంకు వద్ద జరిగిన ఘటనలో అనూహ్యంగా తలదూర్చి, వివాదాస్పద ఘటనకు కారకుడైనట్లు భావిస్తున్న ఆర్మీ జవాన్ చివరికి పోలీసులపైనే సోషల్ మీడియాలో ఆరోపణలకు దిగిన నేపథ్యంలో వైరా ఏసీపీ ఈ ప్రకటన జారీ చేయడం విశేషం. ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం..

బూదాల మనోజ్ అనే ఆర్మీ జవాన్‌ విధులకు వెళ్లకుండా గైర్హాజరై తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్మీ అధికారులు డిజెక్టర్ ఉత్తర్వులతోపాటు అతన్ని పట్టుకునేందుకు వారెంట్ జారీ చేశారు. దీంతో ఖమ్మం పోలీసులు నిన్న బూదాల మనోజ్ ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో అప్పగించారు. గతంలో కూడా విధులకు వెళ్లకుండా గైర్హాజరై తప్పించుకుని తిరుగుతున్న నేపథ్యంలో ఆర్మీ అధికారులకు అప్పగించినప్పటికీ పారిపోయి వచ్చాడని ఏసీపీ రహమాన్ తెలిపారు. అంతేగాక ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసుతో పాటు భార్యను వేధింపులకు గురి చేసినటువంటి పలు క్రిమినల్ కేసుల్లో ఇతను నిందితునిగా ఉన్నాడని వైరా ఏసీపీ పేర్కొన్నారు.

చింతకాని మండలం నాగులవంచ పెట్రోల్ బంక్ వద్ద జరిగిన దాడి కేసులో నిందితుడిగా విచారణ నిమిత్తం చింతకాని పోలీస్ స్టేషన్ వచ్చిన తనపై పలువురు స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారని బూదాల మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల్లో ఇద్దరు వ్యక్తులపై అట్రాసిటి కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ కేసులో ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా పూర్తి నిష్పక్షపాతంగా విచారణ కొనసాగుతున్నప్పటికీ బూదాల మనోజ్ అనే ఆర్మీ జవాన్ ఉద్దేశ్యపూర్వకంగా సామజిక మాధ్యమాలలో స్ధానిక పోలీసులపై అసత్య ఆరోపణలు చేస్తూ పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదని ఏసీపీ రహమాన్ అన్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని ఎవరినీ ఉపేక్షించబోమని ఏసీపీ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Popular Articles