పదిహేడేళ్ల బాలున్ని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుందనే అభియోగంపై ఖమ్మం జిల్లాలో ఓ మహిళపై పోలీసులు పోక్సో చట్టం కింద శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి పట్టణానికి చెందిన వివాహిత మహిళ (30) భర్తతో విడిపోయి విడాకులు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఓ పదిహేడేళ్ల బాలుడు కిడ్నాప్ నకు గురైనట్లు అతని కుటుంబం నాలుగు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ‘కిడ్నాప్’ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల దర్యాప్తులో బాలుని కిడ్నాప్ ఘటనలో నివ్వెరపోయే అంశాలు వెల్లడయ్యాయి. భర్తతో విడాకులు తీసుకున్న సదరు వివాహిత మహిళ 17 ఏళ్ల బాలున్ని కిడ్నాప్ చేసినట్లు తేలింది. అంతేకాదు ఆ బాలున్ని ఈ వివాహిత మహిళ పెళ్లి చేసుకున్నట్లు కూడా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. మొత్తం సంఘటనపై బాలుని తల్లి ఫిర్యాదు ప్రకారం వివాహిత మహిళపై సత్తుపల్లి పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరు పరిచి, రిమాండ్ కు పంపారు. బాలున్ని అతని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన సత్తుపల్లి పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


