ఖమ్మం: ఖమ్మం నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కస్పాబజార్ లో గల జీవీ మాల్ పక్కన గల సందులో గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు గురైన మహిళ (35)ను భద్రాచలానికి చెందిన ప్రమీలగా పోలీసులు గుర్తించారు. ఆమె భద్రాచలానికే చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుని భార్యగా కనుగొన్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. హత్యకు గురైన ప్రమీల తొలుత భద్రాచలంలోని ఓ బట్టల షాపులో పనిచేసేంది. పిల్లలు కలగని కారణంగా కొన్నేళ్లుగా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. ఈ పరిణామాల్లోనే ఆమె భర్త స్నేహితుడైన ఓ వ్యక్తి ప్రమీలను వేధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు నెలరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే అతని వేధింపులు తీవ్రతరం కావడంతో భరించలేక ఇటీవలే ప్రమీల భద్రాచలం నుంచి ఖమ్మం వచ్చి నగరంలోని ఓ బట్టల షాపులో పనిచేసుకుని జీవిస్తోంది.

ఈ నేపథ్యంలోనే గత రాత్రి జీవీ మాల్ పక్క సందులో ప్రమీల గొంతుకోసిన స్థితిలో దారుణ హత్యకు గురి కావడం గమనార్హం. ఖమ్మం వన్ టౌన్ పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నగరం నడిబొడ్డున గల ప్రధాన వ్యాపార సముదాయపు ప్రాంతంలోనే జరిగిన ఈ హత్య తీవ్ర కలకలం రేపింది. ప్రమీల భర్త స్నేహితుడే ఆమెను చంపి ఉంటాడనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

