హైదరాబాద్: సామాజిక కార్యకర్త, మాజీ నక్సల్ గాదె ఇన్నయ్యను కొద్ది గంటల క్రితం జనగామ జిల్లా జఫర్ గఢ్ లో NIA అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇన్నయ్యపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ‘మన తొలివెలుగు’ యూ ట్యూబ్ ఛానల్ ప్రసారం చేసిన వీడియో URL లింక్ వివరాలను, ఈ వీడియోకు ఛానల్ నిర్వాహకులు వాడిన ఆంగ్ల శీర్షికను, అందులో ఇన్నయ్య 16.40 సెకన్లపాటు ప్రసంగించిన అంశాన్ని NIA అధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. గాదె ఇన్నయ్య అరెస్టుకు దారి తీసిన పరిస్థితులను ఉటంకిస్తూ ‘Suspected Offence’ కాలమ్ కింద ఎఫ్ఐఆర్ లో ఈ వివరాలను పేర్కొన్నారు..

అదేవిధంగా 12వ నెంబర్ కాలమ్ కింద ‘First Information contents’గా కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు హాజరైన సందర్బంగా ఇన్నయ్య ప్రసంగించిన అంశాలను NIA అధికారులు ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించారు. వికల్ప్ అంత్యక్రియలకు హాజరైన సమయంలో ఇన్నయ్య చేసిన ప్రసంగపు వీడియోను ‘మన తొలివెలుగు’ యూ ట్యూబ్ ఛానల్ ప్రసారం చేసింది. ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ప్రజలను ప్రేరేపించారనే అభియోగాలపై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 152 కింద, ఉపా చట్టంలోని 13, 39 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి NIA అధికారులు ఇన్నయ్యను అరెస్ట్ చేశారు.

అయితే తన ప్రసంగం ద్వారా మావోయిస్టులకు అనుకూలంగా, ప్రజలను ప్రేరేపించే విధంగా ఇన్నయ్య వ్యాఖ్యలు చేశారని NIA తన ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నేపథ్యంలో వాటిని ప్రసారం చేసిన ఛానల్ నిర్వాహకుడిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. రఘు అరెస్టు అయ్యే అవకాశాలను ఇంకోవైపు పోలీసు వర్గాలు కూడా తోసిపుచ్చలేకపోతున్నాయి. కేసు దర్యాప్తులో భాగంగా ఛానల్ నిర్వాహకుడు గంజి రఘును కూడా అరెస్ట్ చేయవచ్చని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇన్నయ్య అరెస్టుకు దారి తీసిన వీడియోను అదే ఛానల్ నిర్వాహకుడు ‘ఇన్నయ్య అరెస్టుకు కారణం ఇదే వీడియో’ శీర్షికన మళ్లీ తాజాగా నాలుగు గంటల క్రితం (ఈ కథనం రాసే సమయానికి) యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేయడం గమనార్హం.

ఈ పరిస్థితుల్లోనే గాదె ఇన్నయ్యతోపాటు మరో యూ ట్యూబ్ ఛానల్ పైనా కేసు నమోదైనట్లు ఇంకో యూ ట్యూబ్ ఛానల్ ఓ వార్తా కథనాన్ని ప్రసారం చేయడం ప్రస్తావనార్హం. అయితే ఆయా ఛానల్ పై కేసు నమోదైన అంశం అధికారికంగా మాత్రం ధ్రువపడలేదు. ఈ పరిణామాల్లో ‘మన తొలివెలుగు’ ఛానల్ నిర్వాహకుడు గంజి రఘును NIA అరెస్ట్ చేయవచ్చనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన గాదె ఇన్నయ్య ప్రసంగం, అరెస్ట్ పరిణామాలు మున్ముందు మరెవరి అరెస్టుకు దారి తీస్తాయనేది ఉత్కంఠగా మారింది.

