తన అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ముందే ఉప్పందిందా? ఏసీబీ కేటీఆర్ ను నేడు అరెస్ట్ చేస్తుందా? ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు వ్యవహారంలో సోమవారం మరోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మూడుసార్లు కాదు ముప్పయి సార్లు విచారణకు పిలిచినా తాను హాజరవుతానని, చట్టాలపై, న్యాయస్థానాలపై తనకు గౌరవం ఉందని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేసీఆర్, హరీష్ రావులను కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి పైశాచికానందం పొందారని, తనను ఏసీబీ విచారణకు పిలుస్తూ మానసిక ఆనందం పొందుతున్నారని ఆయన అన్నారు. అవసరమైతే తనను అరెస్ట్ కూడా చేయవచ్చని, తెలంగాణా ఉద్యమంలో గతంలో జైలుకు వెళ్లానని, మరోసారి జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదన్నారు.

అయితే కేటీఆర్ ‘అరెస్ట్’ వ్యాఖ్య చేసిన నేపథ్యంలో ఆయనకు ఈ విషయంలో ముందే సమాచారం అంది ఉంటుందా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. పదేళ్లు తాము రాష్ట్రాన్ని పరిపాలించామని, తమకూ విజిల్ బ్లోయర్స్ ఉంటారని, ప్రభుత్వంలో చీమ చిటుక్కుమన్నా తమకు తెలిసిపోతుందని గతంలో కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ తనను అరెస్ట్ చేస్తుందనే విషయంపై ముందస్తు సమాచారం ఉండడం వల్లే కేటీఆర్ అలా వ్యాఖ్యానించారా? అనే సంశయాలు బీఆర్ఎస్ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.
మరోవైపు కేటీఆర్ ను విచారిస్తున్న ఏసీబీ ఆఫీసు ముందు భారీగా పోలీసులు మోహరించడం, ఎవరినీ ఆఫీసు వద్దకు అనుమతించకపోవడం గమనార్హం. మొత్తంగా కేటీఆర్ తనను అరెస్ట్ చేస్తారోమోనని అనుమానాన్ని వ్యక్తం చేస్తూ వ్యాఖ్యానించిన తీరు గులాబీ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో గుబులు రేపుతోంది. తన అరెస్ట్ గురించి కేటీఆర్ ఇంకా ఏమన్నారో దిగువన గల వీడియోలో చూడవచ్చు..