కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దీపావళి పండుగ పూట ‘పొలిటికల్ బాంబ్’ పేల్చారు. ఆయనేమంటారంటే.. తెలంగాణాకు చెందిన రాజకీయ నాయకులు వేదికలపై ప్రజాస్వామ్యాన్ని ప్రభోదిస్తూ మావోయిస్టులకు మద్ధతునిస్తున్నట్లు పేర్కొంటున్నవారు నక్సలైట్లతో సంబంధాలను తెంచుకోవాలన్నారు. లేనిపక్షంలో వారి గుట్టు రట్టవుతుందన్నారు. దేశభద్రతకు ముప్పుగా పరిణమించేవారు ఎవరైనా తప్పించుకోలేరన్నారు. ఎవరైనా కావచ్చు, ఎంత పెద్దవారైనా సరే, తప్పువైపు నిలబడితే ఎంతపెద్దవారైనా పడిపోక తప్పదన్నారు. నిన్న తన ‘ఎక్స్’ ఖాతాలో బండి సంజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలతో కూడిన పోస్టులోని సారాంశమిది.
బండి సంజయ్ ఎక్స్ పోస్ట్ వేదికగా చేసిన ఆయా వ్యాఖ్యల నేపథ్యంలోనే బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు రామచందర్ రావు కూడా ఇదే అంశంపై స్పందించడం గమనార్హం. తెలంగాణాలోని అనేక మంది రాజకీయ నాయకులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని రామచందర్ రావు నేరుగానే వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని లొంగిపోయిన మావోయిస్టులు చెబుతున్నారని, అందువల్ల మావోలతో లింకులు గల పొలిటికల్ లీడర్ల గురించి ప్రభుత్వం విచారణ జరపాలన్నారు. పొలిటీషియన్లకు ‘నక్సల్’ బంధాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కూడా రామచందర్ రావు డిమాండ్ చేశారు.

అయితే తెలంగాణాకు చెందిన రాజకీయ నాయకులకు మావోయిస్టు పార్టీ నక్సలైట్లతో సంబంధాలున్నాయనే ఆరోపణలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఓ పత్రిక కథనాన్ని ఆధారంగా ఉటంకించారా? అనే ప్రశ్న రేకెత్తుతోంది. ఎందుకంటే తన ఎక్స్ ఖాతాలో చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన పోస్టులో ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) ప్రచురించిన రెండు వార్తా కథనాలను అటాచ్ చేయడం గమనార్హం. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ అభయ్ 60 మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం ముందు లొంగిపోయిన నేపథ్యపు అనంతరం TOI ఈ వార్తా కథనాన్ని ప్రచురించింది. అభయ్ ను ఉటంకిస్తూ TOI తన వార్తా కథనంలో పలు అంశాలను పేర్కొంది. ఇందులో ముఖ్యాంశమే ‘తెలంగాణా పొలిటికల్ లీడర్లకు నక్సల్ లింకులు’.
లొంగుబాటు సందర్భంగా మహారాష్ట్ర పోలీసులు మల్లోజులను విచారణ చేసిన తర్వాత రూపొందించిన నివేదికలో ‘మావోయిస్టులతో తెలంగాణా రాజకీయ నేతల లింకు’ల గురించి ప్రస్తావించినట్లు ఆంగ్ల పత్రిక TOI ఆసక్తికర వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో మల్లోజుల వేణుగోపాల్ పోలీసులకు చెప్పినట్లు పేర్కొన్న అంశాల్లో సారాంశాన్ని గమనిస్తే.. మావోయిస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర కమిటీతో రాజకీయ నాయకులకు కొందరికి ‘రహస్య బంధం’ ఉందన్నారు. ఇదే కథనంలో ‘అవకాశవాద నక్సల్స్’ అనే పదాన్ని వాడడం గమనార్హం. తెలంగాణాకు చెందిన రాజకీయ నాయకుల్లోని ఓ వర్గపు రక్షణలో పనిచేస్తున్నారనేది మల్లోజుల చెప్పిన పాయింట్ గా TOI తన కథనంలో తెలిపింది.

ప్రతిఘటననను నటిస్తూనే అప్రకటిత కాల్పుల విరమణను, రాష్ట్ర వనరులను అనుభవిస్తున్నారని, తెలంగాణా రాష్ట్రం ఎందుకింత సౌమ్యంగా ఉంటోందనే ప్రశ్నను కూడా మల్లోజుల లేవనెత్తినట్లు TOI కథనంలోని మరో అంశం. తన లొంగుబాటును ‘అవకాశవాద నక్సల్స్’ వ్యతిరేకించాయని, తెలంగాణా రాజకీయ నాయకులతో రహస్య బంధం గల వారు తాను అబూజ్ మడ్ లో సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని కోరుకున్నట్లు కూడా అభయ్ చెప్పారట. తాను వారి మాటను విని ఉన్నట్లయితే మరో 500 మంది గిరిజనులు చనిపోయేవారని, ప్రస్తుతం తెలంగాణాలో అక్టోబర్ నెలాఖరు వరకు తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతుందని భూపతి పేర్కొన్నట్లు వార్తా కథనంలోని ఇంకో అంశం.
ఈ నేపథ్యంలో మావోయిస్టులతో రహస్య సంబంధాలను కొనసాగిస్తున్న తెలంగాణా రాజకీయ నాయకులెవరనేది ప్రశ్నార్థకంగా మారింది. మల్లోజుల వేణుగోపాల్ ఈ అంశాన్ని పోలీసులకు చెప్పినట్లు TOI ప్రచురించిన వార్తా కథనాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారా? అనే ప్రశ్నలు ఈ సందర్భంగా ఉద్భవిస్తున్నాయి. ఎందుకంటే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్న బండి సంజయ్ వంటి కీలక నేత కేవలం ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనాన్ని మాత్రమే కాకుండా, నేరుగా మహారాష్ట్ర పోలీసులు రూపొందించిన నివేదికను తెప్పించుకోవచ్చనే వాదన వినిపిస్తోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాలో బండి సంజయ్ అడిగితే ఆయా నివేదికను మహారాష్ట్ర పోలీసులు ఇవ్వకుండా ఉంటారా? అనేది మరో ప్రశ్న.

అంతేగాక తెలంగాణా రాజకీయ నాయకులకు మావోయిస్టులతో ‘బంధం’ ఉండి ఉంటే ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) కూడా ఇప్పటికే ఓ కీలక నివేదికను రూపొందించే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఐబీ నివేదికనో, మహారాష్ట్ర పోలీసుల రిపోర్టునో తెప్పించుకుని నక్సల్స్ తో లింకులను కొనసాగిస్తున్న రాజకీయ నాయకులెవరో బట్టబయలు చేస్తే బాగుండేదనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ బండి సంజయ్ చెబుతున్న తెలంగాణాకు చెందిన ఆ రాజకీయ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారా? లేక అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వారా? ఆయా నాయకులు తెలంగాణా రాజధాని కేంద్రంలో ఉన్నారా? లేక ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు ఏదేని కీలక పదవుల్లో ఉన్నారా? ఏ పదవులూ లేకుండా విపక్షంలో ఉన్నారా? ఇవీ ఇప్పుడు తెలంగాణా పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న చర్చల్లో రేకెత్తుతున్న అసలు ప్రశ్నలు.
