Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

‘దళ’పతి లొంగుబాటలో అసలేం జరుగుతోంది!?

1990వ దశకం ఆరంభంలో పీపుల్స్ వార్ ప్రొవిన్షియల్ కమిటీ సభ్యుడు పులి అంజయ్య దంపతులు వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం మద్దెలగూడెం ప్రాంతంలో ఎన్కౌంటర్ ఘటనలో చనిపోయిన సంఘటన గుర్తుందిగా? ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల వ్యవధిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొయ్యూరు ఎన్కౌంటర్ సంఘటనలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా ఆదిరెడ్డి, ఉత్తర తెలంగాణా స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి శీలం నరేష్, రాష్ట్ర స్థాయి నేత ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డిలు మృతి చెందడం కూడా విప్లవ కార్యకలాపాల పరిశీలకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఘటన.

ఈ రెండు సంఘటనలపైనా అప్పట్లో పౌరహక్కుల సంఘం నేతలు, ఇతర విప్లవ సంస్థలు కూడా పోలీసులపై ఆరోపణలు చేశాయి. ఆయా నేతలను బెంగళూరులోని ‘డెన్’ నుంచి పట్టుకొచ్చి కాల్చి చంపారనేది అప్పట్లో పౌర హక్కుల సంఘం నేతలు చేసిన ఆరోపణల సారాంశం. ఇందుకు పోలీసు శాఖ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చిందనేది వేరే విషయం. ఆరోపణలు, విమర్శలు సంగతి ఎలా ఉన్నప్పటికీ, అప్పటి పీపుల్స్ వార్, ప్రస్తుత మావోయిస్టు పార్టీపై స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) తన విధి నిర్వహణలో భాగంగా గట్టి పట్టు సాధించిందనేందుకు ఈ రెండు భారీ ఎన్కౌంటర్ ఘటనలను విప్లవ కార్యకలాపాల పరిశీలకులు ఉదహరిస్తుంటారు. ఇప్పుడీ రెండు ఉదంతాల ప్రస్తావన దేనికంటే…?

మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సహా మరికొందరు ముఖ్య నక్సల్ నేతలు లొంగిపోనున్నారనే వార్తలు ఆయా ఎన్కౌంటర్ ఉదంతాలను మరోసారి గుర్తుకు తీసుకువస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మళ్లీ ఎస్ఐబీ తనదైన శైలితో మావోయిస్టు పార్టీని ఇక కోలుకోలేని దెబ్బకొట్టే విధంగా వ్యూహరచన చేసిందనే ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీని ఆత్మరక్షణలో పడవేసే దిశగా తెలంగాణా పోలీసు శాఖ ఇందుకు పకడ్బందీ వ్యూహ రచన చేసిందంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది మావోయిస్టు పార్టీలో? గణపతి సహా మరికొందరు ముఖ్య నేతలు ‘లొంగుబాట’ను ఎందుకు ఎంచుకున్నట్లు? ఇదీ ఇప్పుడు జరుగుతున్న అసలు చర్చ. ఈ అంశంపై భిన్నకథనాలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి.

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో పోటీ ప్రభుత్వాన్ని నడిపిన పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ) పార్టీలో విలీనమై ‘మావోయిస్టు’ పార్టీగా అవతరించిన తర్వాత గణపతి జాతీయ స్థాయిలో మోస్ట్ వాంటెడ్ నక్సల్ లీడర్ గా మారారు. ఒకే గొడుగు కిందకు వచ్చిన రెండు వామపక్ష తీవ్రవాద పార్టీలు దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు సవాల్ విసిరాయి. గడచిన దశాబ్ధా కాలంగా తెలంగాణా ప్రాంతంలో ఆ పార్టీ కార్యకలాపాలు నామమాత్రంగానే ఉన్నప్పటికీ, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్ గఢ్, ఒడిషా, పశ్చిమ బెంగాల వంటి రాష్ట్రాల్లో గట్టి పట్టు సాధించాయి.

ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి

పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్యను పార్టీ కార్యదర్శి పదవి నుంచి దించేసి, పార్టీ నుంచి బహిష్కరించిన పరిణామాల అనంతరం కేంద్ర కమిటీ కార్యదర్శిగా గణపతి బాధ్యతలు స్వీకరించారు. 1991లో జరిగిన ఈ పరిణామాల నుంచి దాదాపు ఏడాన్నదిర క్రితం వరకు కూడా దశబ్ధాలపాటు గణపతి కార్యదర్శిగానే ఉన్నారు. అయితే పార్టీని దేశ నలుదిశలా విస్తరింపజేయడంలో కీలక పాత్ర పోషించిన గణపతి వయోభారం, అనారోగ్య పరిస్థితులు కారణంగా కార్యదర్శి పదవి నుంచి తప్పకున్నారనేది ఓ వాదన. సైద్ధాంతిక విభేదాల నేపథ్యంలో కొండపల్లి తరహాలోనే గణపతిని కూడా కార్యదర్శి పదవి నుంచి దించేశారని, ఆయన స్థానంలో కార్యదర్శిగా నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారనేది మరోవాదన.

ఆయా అంశాల్లో నిజానిజాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, మావోయిస్టు పార్టీలో చోటు చేసుకున్నట్లు భావిస్తున్న అంతర్గత విభేదాలను పసిగట్టిన ఎస్ఐబీ అధికారులు చాకచక్యంగా పావులు కదిపినట్లు ప్రచారం జరుగుతుండడమే గమనించాల్సిన అసలు అంశం. ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, ఒడిషా తదితర రాష్ట్రాలకు చెందిన అనేక మంది నక్సల్ ముఖ్య నేతలు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతల నాయకత్వాన్ని అంగీకరించడం లేదనే ప్రచారం కూడా జరిగింది. పార్టీ విస్తరణకు, బలోపేతానికి గణపతి వంటి వృద్ధాప్య నేతలు ‘దుందుడుకు’ చర్యలు తీసుకోవడం లేదనే అంతర్గత చర్చ జరిగినట్లు కూడా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందువల్లే భారీ చర్చల అనంతరం గణపతిని కేంద్ర కార్యదర్శి పదవి నుంచి తొలగించారని, కాదు… కాదు ఆయనే తప్పుకున్నారనే పరస్పర విరుద్ధ వాదనలు ఉండనే ఉన్నాయి.

మొత్తంగా మావోయిస్టు పార్టీలోని అంతర్గత, సైద్ధాంతిక విభేదాలపై ఓ కన్నేసి ఉంచిన ఎస్ఐబీ విభాగం ఆయా పరిణామాలపై మెరుపు వేగంతో స్పందించిందంటున్నారు. ఇందులో భాగంగానే పావులు కదిపి గణపతిని ‘లొంగుబాటు‘ దిశగా పయనింపజేసిందనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు గణపతి బంధువర్గంలోని ఉత్తర తెలంగాణాకు చెందిన ఒకరిద్దరు ముఖ్య రాజకీయ నేతలను ఎస్ఐబీ అధికారులు రంగంలోకి దించారంటున్నారు.

ఇందులో రాజకీయ కోణం పాత్ర కూడా దాగి ఉందనేది మరో కథనం. తద్వారా మావోయిస్టు పార్టీని భవిష్యత్తులో మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతీసేందుకు ఎస్ఐబీ వేసిన ఎత్తుగడ సక్సెస్ అయిందంటున్నారు. ఫలితంగానే గణపతి, తదితర ముఖ్య నేతలు ‘లొంగుబాట’లోకి వచ్చారంటున్నారు. గణపతి ‘లొంగుబాటు’ సీన్ దేశవ్యాప్తంగా ఓ పెద్ద సంచలనానికి దారి తీయడమే కాదు, విప్లవ కార్యకలాపాలపై తీరు తెన్నులపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందనే వాదన కూడా ఈ సందర్భంగా వినిపిస్తోంది.

Popular Articles