Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

అదే శిక్షయితే.. ఈ కమిషన్లు దేనికి సారూ!?

(By Vasireddy Srinivas)
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన చేస్తున్న ప్రకటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. కొంత మంది మంత్రులతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా రేవంత్ రెడ్డి ప్రకటనలు పార్టీ ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత ఇక్కడ జరిగిన అతి పెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చోటు చేసుకున్న అక్రమాలు.. అనే ప్రచారం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇప్పుడు ఆయన క్యాబినెట్ లో ఉన్న కొంత మంది మంత్రులు కూడా ప్రతిపక్షంలో ఉండగా ఇదే ఆరోపణలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎక్కువ లబ్ది పొందిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీని రక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

దీనికి ప్రధాన కారణం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి వేసిన విచారణ కమిషన్ లోనే మేఘా ఇంజనీరింగ్ కు ఇబ్బంది కలిగే అంశాలు ఏమి రాకుండా టర్మ్స్ అఫ్ రిఫరెన్స్ లోనే ఈ పని చేశారు.. అని అధికార వర్గాలు చెపుతున్నాయి. అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి జస్టిస్ పీసి ఘోష్ కమిషన్ నివేదికలోని విషయాలు బయటికి వచ్చినా ఎక్కడా కూడా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ పేరే కనిపించలేదు. ఈ పరిణామం చూసి ఐఏఎస్ అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా అవాక్కవుతున్నారు. ఇది ఇలా ఉంటే గురువారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పార్టీని రాజకీయంగా మరింత డ్యామేజ్ చేసేలా ఉన్నాయనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. రేవంత్ రెడ్డి తాజా ప్రకటనతో అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ తో పాటు విద్యుత్ అక్రమాలపై వేసిన కమిషన్ లపై ఎలాంటి చర్యలు ఉండవనే సంకేతాలు ఇచ్చినట్లయిందనే అభిప్రాయాన్ని కొంత మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు.

కాళేశ్వరం కమిషన్ నివేదిక అందిన తర్వాత దీనిపై ప్రత్యేక క్యాబినెట్ సమావేశం పెట్టి మరీ దీన్ని ఆమోదింపజేశారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కలిసి మీడియా సమావేశం పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యానికి అంతా కేసీఆర్.. అని తేల్చారు. అన్ని స్థాయిల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లే రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడింది, నష్టం జరిగింది.. అని చెప్పుకొచ్చారు. ఇదంతా చూస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదికతో పాటు ఇతర నివేదికల ద్వారా రాజకీయంగా బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి వాడుకునేలా కనిపిస్తుందే తప్ప.. వీటిపై ఎలాంటి చర్యలు ఉండేలా లేవనే చర్చ మొదలైంది. దీని వెనక కొంత మందికి భారీ ఎత్తున ప్రయోజనాలు కలగబోతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

కాళేశ్వరం కమిషన్ నివేదికను ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు అందజేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ (ఫైల్ ఫొటో)

కేసీఆర్ ను ఎన్నికల్లో ఓడించడమే పెద్ద శిక్ష.. ఇక ఆయన్ను జైలులో పెట్టాల్సిన అవసరం ఏముందనని రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో మాట్లాడినట్లు ప్రముఖంగా వార్తలు వచ్చాయి. అంతే కాదు…ఆయన ఇప్పుడు ఉంటున్న ఫార్మ్ హౌస్ కు, చర్ల పల్లి జైలుకు పెద్ద తేడా ఏముంటుంది? అని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. మేం విద్వేష రాజకీయాలు చేయం.. వంటి పెద్ద పెద్ద డిప్లమాటిక్ డైలాగులు రేవంత్ రెడ్డి వాడటం వెనక వేరే కథ ఉంది.. అనే చర్చ కూడా సాగుతోంది. రేవంత్ రెడ్డి చెపుతున్నట్లు ఎన్నికల్లో ఓడించటమే శిక్ష వేసినట్లయితే, మరి ప్రభుత్వం ఎందుకు ఇంత హంగామా చేసి విద్యుత్, కాళేశ్వరం అంశాలపై కమిషన్ లు వేసినట్లు అనే ప్రశ్నలు రావా?

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చిస్తామని ఈనెల 4న నిర్వహించిన కేబినెట్ మీటింగ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వెల్లడించినప్పటి చిత్రం

అంటే వీటి ద్వారా రాజకీయంగా లబ్దిపొందటం తప్ప…ప్రజలు పన్నుల రూపాయల్లో కట్టిన వేల కోట్ల రూపాయల నిధులు అధికారంలో ఉన్న వాళ్ళు ఏమి చేసినా కూడా ఎలాంటి చర్యలు ఉండవు అనే సంకేతాలు రేవంత్ రెడ్డి పంపుతున్నారు.. అనే చర్చ ఇప్పుడు తెర మీదకు వస్తోంది. పక్క గా ఒక లెక్క ప్రకారమే రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేసీఆర్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అనే మాటలు మాట్లాడారు.. అని ఒక మంత్రి అభిప్రాయపడ్డారు. అయితే ఇవి ఖచ్చితంగా రాజకీయంగా, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి డ్యామేజ్ చేయటం ఖాయమనే చర్చ కూడా సాగుతోంది. కాళేశ్వరంలో అంతా కేసీఆరే అంతా చేశారని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్లేట్ పిరాయించటం వెనక ఏదో జరిగింది.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఎప్పుడైతే మేఘాను ఈ ప్రాజెక్ట్ నుంచి రక్షించే ప్రయత్నం జరిగిందో.. అప్పుడే కేసీఆర్ ను కూడా రక్షించినట్లు.. అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు.
(Telugu Gateway.com సౌజన్యంతో..)

Popular Articles