Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ఐజీ ఆగ్రహం దేనికి? ఇల్లెందు సీఐ సస్పెన్షన్ వెనుక..!?

విధినిర్వహణలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం సహజమే. ఈ అంశంలో ఒక్కో ఉన్నతాధికారి తీసుకునే చర్య ఒక్కోరకంగా ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ శాఖలో తీసుకునే చర్యలు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమవుతుంటాయి.  బుధవారం సస్పెన్షన్ వేటు పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సీఐ బత్తుల సత్యనారాయణ ఏం చేశారు? మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహానికి కారణమేంటి? ఇదీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు మల్టీ జోన్-1 పరిధిలోని పోలీసు వర్గాల్లో సాగుతున్న చర్చ. సత్యనారాయణ సస్పెన్షన్ కు దారి తీసిన కారణాన్ని వివరిస్తూ.. ‘భార్యాభర్తల మధ్య వివాదం కేసులో భర్త తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించి వారి హక్కులకు భంగం కలిగించినందుకు గాను’ సీఐపై ఈ చర్య తీసుకున్నట్లు  భద్రాద్రి జిల్లా ఎస్పీ కార్యాలయం స్పష్టం చేసింది. ఇంతకీ ఇల్లెందు సీఐ సత్యనారాయణ దురుసు ప్రవర్తన ఏమిటి? అసలేం జరిగింది? అసలు విషయంలోకి వెడితే..

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. డల్లాస్ లో ఉండే ఇల్లెందుకు చెందిన ఎన్ఆర్ఐ నవీన్ రెడ్డితో హైదరాబాద్ చెంగిచెర్లకు చెందిన శ్రావ్య అనే యువతికి 2022లో వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవనంలో ఇప్పటివరకు సంతానం కలగలేదు. దీంతో శ్రావ్యను నవీన్ రెడ్డి పుట్టింటికి పంపాడు. సంతానం కలిగే అవకాశం లేదని కారణం చెబుతూ ఆమెను ఇండియాకు పంపాడు. ఈ అంశంలో శ్రావ్య ‘వరకట్న వేధింపుల’ పేరుతో పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసును అక్కడి పోలీసులు కొత్తగూడెం పోలీసులకు బదిలీ చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో శ్రావ్య బంధువుగా ప్రచారం జరుగుతున్న కొత్తగూడేనికి చెందిన ఓ రాజకీయ నాయకుడి జోక్యంతో  ఫిర్యాదుపై ఇల్లెందు సీఐ సత్యనారాయణ తీవ్రస్థాయిలో స్పందించినట్లు తెలుస్తోంది.

ఇల్లెందు సీఐ సత్యనారాయణ

ఇందులో భాగంగానే నవీన్ రెడ్డి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి, వాళ్లను లాకప్ లో బంధించినట్లు సమాచారం. లాకప్ లోనే గల కొందరు దొంగలకు ‘పోలీసు మర్యాద’ను స్వయంగా వీళ్లకళ్ల ముందే చూపించడంతో నవీన్ రెడ్డి తల్లిదండ్రులు తీవ్రంగా భీతిల్లినట్లు తెలుస్తోంది. ఓ రోజు మొత్తం లాకప్ లో తమకు జరిగిన పోలీసు ‘మర్యాద’పై, హక్కుల భంగంపై ఆ తల్లిదండ్రులు ఐజీ చంద్రశేఖర్ రెడ్డిని కలిసి వివరిస్తూ భోరున విలపించినట్లు సమాచారం. తమ కుమారుడు తప్పు చేస్తే తమకు ఈ శిక్ష ఏమిటని ఐజీ ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

దీంతో తీవ్రంగా ఆగ్రహించిన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నవీన్ రెడ్డి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన రోజునాటి సీసీ ఫుటేజీని తెప్పించుకుని పరిశీలించి, విచారణకు ఆదేశించారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కు చెందిన ఓ ఉన్నతాధికారి సైతం ఈ విషయంలో విచారణ జరిపి ఐజీకి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. మొత్తంగా నవీన్ రెడ్డి తల్లిదండ్రుల విషయంలో అతిగా స్పందించిన సీఐ సత్యానారాయణను ఈ పరిణామాల్లోనే సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకున్న సందర్భాల్లో అందుకు కారణాలను పోలీసు శాఖ బహిర్గతం చేయడం అరుదు. ఈ ఉదంతంలో తీసుకున్న చర్య నేపథ్యాన్ని వెల్లడిస్తూ ‘భార్యాభర్తల మధ్య వివాదం కేసులో భర్త తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించి వారి హక్కులకు భంగం కలిగించినందుకు గాను’ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సీఐ సత్యనారాయణను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ కార్యాలయం స్పష్టంగా తన ప్రకటనలో ఉటంకించడం ఈ సందర్భంగా గమనార్హం.

Popular Articles