Friday, March 6, 2026

Top 5 This Week

Related Posts

Cybercrime Robbery Case: వికాస్ చౌదరికి ఈడీ ఉచ్చు!

(సమీక్ష ప్రత్యేక కథనం)
ఉడతనేని వికాస్ చౌదరి.. పేరు గుర్తుంది కదా? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైబర్ నేరాల కేసులో అత్యంత కీలక నిందితుడు. అస్ట్రేలియన్లు టార్గెట్ గా రూ. 549.95 కోట్ల రూపాయలను దోచుకున్నట్లు ఖమ్మం జిల్లా పెనుబల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రధాన సూత్రధారిగా ప్రాచుర్యం పొందిన వ్యక్తే ఉడతనేని వికాస్ చౌదరి. ఇదే కేసులో ఆరుగురు ముఖ్య నిందితుల్లో పోట్రు ప్రవీణ్, పోట్రు మనోజ్ కళ్యాణ్ తదితరులు సహా ఇరవై మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

అయితే ఈ కేసులో అత్యంత కీలక నిందితునిగా భావిస్తున్న ఉడతనేని వికాస్ చౌదరి మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. నలభై రోజులుగా వికాస్ చౌదరి పోలీసుల నుంచి తప్పించుకోవడం వెనుక సత్తుపల్లికి చెందిన అధికార పార్టీ నాయకుడి హస్తముందనే ప్రచారం జరుగుతోంది. పోలీసు వర్గాలు కూడా ఇదే అనుమానాాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉడతనేని వికాస్ చౌదరి కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగం కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం.

సైబర్ నేరాలకు పాల్పడడం ద్వారా దోచిన సొమ్మును మ్యూల్ ఖాతాల ద్వారా విదేశాలకు తరలించారనేది కేసులోని ముఖ్య సారాంశం. కంబోడియా, మయన్మార్ దేశాల నుంచి పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ సైబర్ మోసాల నెట్ వర్క్ కు దాదాపు 110 బ్యాంకు ఖాతాల ద్వారా ఉడతనేని వికాస్ చౌదరి అండ్ గ్యాంగ్ రూ. 650 కోట్ల వరకు జేబులో వేసుకుందనేది పోలీసు దర్యాప్తులో తేలిన తాజా సమాచారంగా ప్రముఖ ఆంగ్ల మీడియా పత్రికల వార్తల్లోకి రావడం గమనార్హం.

వికాస్ చౌదరి అండ్ గ్యాంగ్ పై నమోదైన సైబర్ నేరాల కేసులో పెనుబల్లి పోలీసులు అరెస్ట్ చేసిన కొందరు నిందితులు (ఫైల్ ఫొటో)

ఈ నేపథ్యంలో రూ. 650 కోట్ల సైబర్ నేరాల కేసులో ఈడీ అధికారులు రంగప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లోని సీసీఆర్బీ (సిటీ క్రైం రికార్డ్స్ బ్యూరో) ద్వారా ఈడీ అధికారులు సమగ్ర నివేదికను తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు జరిపేందుకు ఈడీ సిద్ధమైనట్లు తాజా సమాచారం. అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి అండదండలతో స్థానిక పోలీసుల నుంచి అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరుగుతున్న వికాస్ చౌదరికోసం కేంద్ర దర్యాప్తు సంస్థ ఉచ్చు బిగిస్తోందనే వార్తలు పెనుబల్లిలో నమోదైన సైబర్ నేరాల కేసును మరోసారి చర్చల్లోకి తీసుకువచ్చాయి.

మనీలాండరింగ్ కోణంలో ఈడీ గనుక కేసులోని తీగను లాగితే సైబర్ నేరాల ద్వారా దోచుకున్న సొమ్మును ఉడతనేని వికాస్ చౌదరి అండ్ గ్యాంగ్ ఎక్కడెక్కడికి తరలించిందనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. క్రిప్టో కరెన్సీ మార్గాల్లో విదేశాలకు వెళ్లిన దోపిడీ సొమ్ము తిరిగి వికాస్ చౌదరి అండ్ గ్యాంగ్ ఖాతాల్లోకి ఎలా వచ్చింది? ఆ సొమ్ము ఇక్కడ మరెరెవరి ఖాతాల్లోకైనా చేరిందా? వికాస్ చౌదరి అరెస్ట్ కాకుండా అండగా నిలిచినట్లు ప్రాచుర్యంలోకి వచ్చిన ముఖ్య వ్యక్తులకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థల్లోకి మళ్లిందా? లేక ఏవేని సినిమా ప్రొడక్షన్ కంపెనీలకు చేరిందా? అనే ప్రశ్నలు ప్రామాణికంగా ఈడీ దర్యాప్తు జరిపే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

Popular Articles