(సమీక్ష ప్రత్యేక కథనం)
చార్టెడ్ ఫ్లయిట్ లో కాలుమీద కాలేసుకుని, కళ్లకు నల్లని చలువ అద్దాలతో, మోకాళ్ల వద్ద చిరిగిన ‘ఫ్యాషన్’ జీన్ ప్యాంట్, చేతికి ఖరీదైన వాచీ వంటి ఆహార్యంలో కనిపిస్తున్న ఈ ‘దర్జా బాబు’ ఎవరో గుర్తు పట్టారా? ఎవరో బిజినెస్ మాగ్నెట్ కాబోలు అనుకుంటున్నారా? లేదంటే ఏ పొలిటికల్ లీడర్ కుమారుడో అనుకుంటున్నారా? లేదంటే బడా పారిశ్రామికవేత్త పుత్రరత్నంగా భావిస్తున్నాారా? అయితే మీకు ఇతని ‘సైబర్’ నేరాల హిస్టరీపై ఐడియా లేనట్లే!
ఎందుకంటే ఇతనేమీ చార్టెడ్ ఫ్లయిట్లలో తిరిగే స్థాయి ‘బాబు’ కానేకాదు. వందల కోట్ల రూపాయాల దోపిడీకి సంబంధించిన సైబర్ నేరాల కేసులో కీలక నిందితుడు. అవాక్కయ్యారా? అయినా సరే అదే నిజం. ఇతని పేరు ఉడతనేని వికాస్ చౌదరి. సత్తుపల్లి నివాసి. ఇదే పట్టణంలో తనదైన శైలిలో రాజకీయ చక్రం తిప్పే ప్రముఖ కాంగ్రెస్ నేత తోడల్లుని కుమారుడన్నమాట. ఇటీవలి కాలంలోనే ప్రముఖంగా వార్తల్లోకి వచ్చాడీ వికాస్ చౌదరి. ఎలా అంటే.. సమాజహిత కార్యకలాపాలద్వారా మాత్రం కాదు. సైబర్ నేరాల్లో కీలక నిందితునిగా పోలీస్ రికార్డుల్లోకి ఎక్కి మీడియా ద్వారా బహుళ ప్రాచుర్యంలోకి వచ్చాడు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి పోలీసులు ఈనెల 11వ తేదీన మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. సైబర్ నేరాలకు పాల్పడడం ద్వారా రూ. 549.95 కోట్లను కొల్లగొట్టిన ఆరుగురు ముఠాలో కీలక వ్యక్తి. ఉడతనేని వికాస్ చౌదరి ఖాతాలో అక్షరాలా ఎనభై కోట్ల నలభై ఒక్క లక్షల (80.41 కోట్ల) మొత్తం లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ సంచలన కేసులో మరో కీలక నిందితుడైన పోట్రు ప్రవీణ్ ను, ముఠా కార్యకలాపాలకు సహకరించిన మరో 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మరి వికాస్ చౌదరి పోలీసులకు దొరకలేదా? అని మాత్రం ప్రశ్నించకండి. ఎందుకంటే ఇతని వెనకాల అధికార పార్టీ ‘పవర్’ ఫుల్లుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్లే దర్యాప్తులో చేతికి చిక్కిన వికాస్ చౌదరిని పోలీసులు అనివార్యంగా వదిలేశారనేది కూడా ఈ ప్రచారంలోని అసలు సారాంశం. ఇంతకీ ఈ వికాస్ చౌదరిని పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారనే ప్రశ్నకు మాత్రం ఇప్పటికిప్పుడు జవాబు లేదు.
ఇంతకీ ఈ తాజా వార్తలో అసలు కంటెంట్ ఏమిటంటారా? ఈ భారీ సైబర్ దోపిడీ కేసులో మరో ఇద్దరు కీలక నిందితులైన పోట్రు ప్రవీణ్, పోట్రు మనోజ్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఇప్పటి వరకు లభ్యమయ్యాయి. కానీ కేసు నమోదై పోలీసులు ఎంటరయ్యాక వికాస్ చౌదరి ఫొటోలు ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. చివరికి అతని సోషల్ మీడియా ఖాతాలు సైతం బ్లాక్ అయ్యాయి. ఒకటీ, అరా ఖాతాలు మనుగడలో ఉన్నప్పటికీ, అవి సినిమా హీరోల ఫొటోలతో కనిపిస్తున్నాయే తప్ప, వికాస్ చౌదరి ఫొటోలు మాత్రం కనిపించడం లేదు. సైబర్ నేరాల దోపిడీ పర్వంలో తన ‘ముఖచిత్రం’ ఎవరికీ కనిపించవద్దనే యోచనతో వికాస్ చౌదరి తన ఫొటోలు దొరక్కుండా జాగ్రత్త పడి ఉంటారనే ప్రచారం ఉండనే ఉంది.
ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు ‘సమీక్ష’ న్యూస్ వికాస్ చౌదరి ఫొటోలను సంపాదించగలిగింది. సైబర్ నేరాల ద్వారా దోచుకున్న సొమ్ము బలంతోనే వికాస్ చౌదరి చార్టెడ్ ఫ్లయిట్లలో తిరిగే స్థాయి అర్థిక స్తోమతకు ఎదిగాడనేది జనం చర్చించుకుంటున్న అంశంలోని అసలు విశేషం. మళ్లీ ఓసారి నిశితంగా చూడండి సైబర్ నేరాల నిందితుని చార్జెట్ ఫ్లయిట్ విలాస జీవితపు ‘దర్జా’ చిత్రాన్ని..!

