Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరద బాధితులకు సాయం నిలిపివేత అంశం ప్రామాణికంగా ఆమె టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. తన ఫేస్ బుక్ ఖాతాలో విజయశాంతి చేసిన పోస్టింగ్ ను దిగువన యధాతథంగా చదవవచ్చు.

గ్రేటర్ హైదరాబాదులో భారీ వర్షాల వల్ల బాధితులైన ముంపు ప్రాంతాల ప్రజలకు వరద సాయం పేరిట కేసీఆర్ దొరగారి సర్కారు ఓట్ల రాజకీయానికి పాల్పడిందనడం కాదనలేని సత్యం. భారీ వర్షాలు కురిసి దాదాపు 3 వారాలు దాటుతున్నా తెలంగాణ సర్కారు ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించలేకపోయింది. ఇచ్చిన పరిహారం కూడా అపహాస్యం పాలైంది. టీఆరెస్ నేతలు సూచించినవారికి మాత్రమే… అదీ చాలావరకూ అరకొరగా ఇచ్చి, నిజమైన బాధితులను విస్మరించి విమర్శలపాలయ్యారు. ఇప్పుడు బల్దియా ఎన్నికలు కేవలం 2 వారాలే ఉన్న నేపథ్యంలో పరిహారం అందని వరద బాధితుల్ని మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోమని చెప్పి, వారిని ఊపిరాడకుండా చేసి ఒక మహిళ మృతికి కూడా కారణమయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే… ఈ చర్య గ్రేటర్ ఎన్నికల కోసం ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నమే. టీఆరెస్ కుట్రను ఎన్నికల సంఘం గుర్తించి, ఎన్నికలయ్యే వరకూ వరద సాయం ఆపమని ఆదేశిస్తే…. ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చెయ్యడం వల్లే సాయం ఆపామనడం “అడలేక మద్దెల ఓడు” అన్నట్టుంది. ఈ పరిస్థితులను చూస్తుంటే… ఇదంతా ప్రభుత్వం చేతగానితనం కంటే… గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఉద్దేశ్యపూర్వకంగానే వరదసాయాన్ని జాప్యం చేసినట్లు స్పష్టమవుతోంది. ఓటర్లు కేసీఆర్ దొరగారి కుట్రను అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్ళు కాదు.

విజయశాంతి

Popular Articles