ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం గిరిజన జాతరపై ఆ మధ్య చిన్న జీయర్ స్వామి అనే ఒకాయన నోరుపారేసుకుని అభాసుపాలైన సంగతి తెలిసిందే కదా? వనదేవతలను గ్రామదేవతలుగా పేర్కొన్న ఆ జీయర్ స్వామిని నెటిజన్లతోపాటు సామాన్య జనం కూడా చెడుగుడు ఆడుకున్నారనేది వేరే సంగతి.. ఆ జీయర్ సాములోరి తరహాలోనే ఈయనెవరో వేణుస్వామి అట. ‘వరిజినల్’ పండితుడు కమ్ జ్యోతిష్యుడట. ఆయన ‘వరిజినల్’ జ్యోతిష్యుడని, పండితుడని ఎవరైనా చెప్పారో లేదో తెలియదుగాని, తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకోవడం విశేషం.
ఈ ‘వరిజినల్’ జ్యోతిష్యుడు కమ్ పండితుడు ఏమంటున్నాడంటే.. చివరికి జ్యోతిష్యం చెప్పుకునే స్వేచ్ఛ కూడా వాళ్ల బొందకు లేకుండా చేశారుట. అతను చెబుతున్నది సొంత కవిత్వం కాదుట. గురువు అధిపతి, కమాండర్ కేతువుట.. అన్నీ క్లియర్ గా ఉన్నాయంటున్నాడు. కేతువు అంటే భక్తికారకుడు, మోక్షకారకుడిగా చెబుతూనే 2026లో జనం ఎక్కువగా గుమిగూడి ఉంటారో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయంటున్నాడు. రేపు జరగబోయే పుష్కరాలు కావచ్చు, సమ్మక్క-సారక్క పండగ కావచ్చు, దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి కావచ్చు.. ఎక్కడైతే భక్తిభావం ఉంటుందో.. అక్కడ చాలా పెద్ద పెను ప్రమాదాలు, సంచలనాలు జరుగుతాయని శాస్త్రం చెబుతోందని ఈ ‘వరిజినల్’ జ్యోతిష్యుడు కమ్ పండితుడు సెలవిచ్చేశాడు.

ఇగ జూస్కోండి.. మన తెలుగు యూ ట్యూబు ఛానళ్లు కొన్నింటి గురించి తెలిసిందే కదా..! ‘ముందు జాగ్రత్తగా చెప్తున్నా.. 2026సం,, సమ్మక్క సారక్క జాతరలో జరగబోయేది ఇదే!! అనే థంబ్ నెయిల్ తో ‘వరిజినల్’ జ్యోతిష్యుడు కమ్ పండితుడు చెప్పిన ఈ నాలుగు ముక్కలతో ఓ వీడియోను అప్ లోడ్ చేసింది ఐ డ్రీమ్స్ అనే యూ ట్యూబ్ ఛానల్. అన్నట్గు ‘31కి నేనూ తాగుతూ ఎంజయ్ చేస్తా.. కామాఖ్య టెంపుల్ నుంచి మిమ్మల్ని గెంటేశారా..?’ అనే ఇంకో శీర్షికతోనూ ఇదే యూ ట్యూబ్ ఛానల్ ఇదే ‘వరిజినల్’ జ్యోతిష్యుడు కమ్ పండితుడు చెప్పిన అంశాలతో మరో వీడియోను కూడా అప్ లోడ్ చేయడం గమనార్హం.

అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే.. 31న తాగుతూ ఎంజయ్ చేసే ఇటువంటి ‘వరిజినల్’ జ్యోతిష్యుల కమ్ పండితుల మాటలు నమ్మాలో వద్దో తేల్చుకోవలసింది మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర భక్తులే. ప్రతి రెండేళ్లకోసారి జరిగే దశాబ్ధాల చరిత్ర గల మేడారం జాతరలో ఇతను జ్యోతిష్కరిస్తున్నటువంటి పెద్ద, పెనుప్రమాదాలు జరిగిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. అయినా 31న తాగి ఎంజాయ్ చేసే ఇటువంటి ‘వరిజినల్’ జ్యోతిష్యుల, పండితుల మాటలను విశ్వసించాలా? అని సమ్మక్క సారక్క భక్తులు ప్రశ్నిస్తున్నారు. వచ్చే జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహాజాతరలో ఏ ప్రమాదమూ జరగదని, సమ్మక్క-సారలమ్మ జాతరపై జీయర్ స్వామి, వేణుస్వామి వంటి వాళ్లు చేసే వ్యాఖ్యలు వనదేవతల జాతరపై ఓ ‘కుట్ర’గా పలువురు భక్తులు పేర్కొంటున్నారు.
31న తాగి ఎంజాయ్ చేసే వేణుస్వామి 2026లో జరగనున్నట్లు జ్యోతిష్కరించిన ‘పెను ప్రమాదపు’ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను దిగువన గల లింక్ లో చూడవచ్చు.

