Top 5 This Week

Related Posts

‘చిక్ పిల్ల’ రెస్టారెంట్ స్టోరీ.. భలే టేస్టీ!

Lights never sets అనుకునే వ్యాపారాల్లో హోటల్ బిజినెస్ ఒకటి. టర్నోవర్, ప్రాఫిట్ లెక్కలతో నిమిత్తం లేదు. దివాలా తీసినప్పుడు తప్ప, మరే సందర్భంలోనూ హోటల్ మూతపడదు.

అమెరికాలో ఓ రెస్టారెంట్ మాత్రం ప్రతి ఆదివారం మూసేస్తారు! అది కూడా తమ సిబ్బంది, కస్టమర్లు చర్చిలకు వెళ్లడానికి, కుటుంబంతో గడపడానికి వీలుగా రెస్టారెంట్ తెరవరు!

అలాగని, అదేదో ఫుట్​పాత్​ మీద నడిపే ఫుడ్ కార్ట్ (Food cart) కూడా కాదు. రోజుకి 3 లక్షల డాలర్ల (రూ.ల్లో 2.65 కోట్లు) వ్యాపారం చేసే రెస్టారెంట్!
దాని పేరు ‘చిక్ పిల్ల’. ఈ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్​కి అమెరికా ఇంట బయట కలిపి 3,300 వరకు రెస్టారెంట్లున్నాయి.

అమెరికాలో chicken sandwichలు తినే తెలుగువాళ్లందరకూ “CHICK- FIL -A” తెలుసు. ‘చిక్ ఫిలా’అని, ‘చిక్ ఫిల్ ఏ’ అని పిలుస్తారు. మనకెందుకు అంత శ్రమ. హాయిగా ‘చిక్ పిల్ల’ అనుకుందాం.

ఈ చిక్ పిల్ల వార్షికాదాయం 2024లో 2,200 కోట్ల డాలర్లు. (రూపాయల్లో లక్ష 80 వేల కోట్లు అనుకుంటా)..

చిక్ పిల్ల మెనూ చాలా సింపుల్​గా ఉంటుంది. హైదరాబాదులో ఒక రెస్టారెంటుకి వెళ్తే 45 రకాల బిరియానీలు, 32 రకాల నాన్–వెజ్ కూరలు, వేపుళ్లతో బెదరగొట్టేలా మెనూ కార్డు ఇచ్చారు!

మెక్ డోనాల్డ్, స్టార్ బక్స్, సబ్ వేల కంటే చిక్ పిల్లకే డిమాండ్ ఎక్కువ. ఫ్రాంచైజ్ తీసుకుని నడిపేవాళ్లకి 15% మార్జిన్ ఉంటుంది. వీళ్ల ఆదాయంలో 60% వరకు drive-through (parcels) ద్వారానే వస్తుంది. పొద్దుగాల 6.30కి తెరిస్తే రాత్రి 10.00కి మూస్తారు. అంటే సుమారుగా 16 గంటలు పనిచేస్తుంది. ఒక అంచనా ప్రకారం franchise ownerకి గంటకు 43 డాలర్లు గిట్టుబాటవుతుందట. రోజుకి 666 డాలర్లు లెక్కేసుకుంటే మన రూ.ల్లో 57 వేలు! అమెరికా జాతీయ వేతనం కంటే చాలా ఎక్కువట! అంటే, ఒక్క చిక్ పిల్ల franchisee తీసుకుంటే చాలు life settle అయిపోయినట్లే!

కానీ, అదంత వీజీ కాదు.
చాలా స్క్రూటినీలు జరిపాక, ఫ్రాంచైజీని సెలక్ట్ చేశాక, వారాల తరబడి శిక్షణ ఇచ్చాక (కొన్ని మార్లు నెలలు పట్టొచ్చు) పర్లేదు అనుకున్నాకనే… చిక్ పిల్ల ఫ్రాంచైజీ అప్పగిస్తారు. అమెరికా, కెనడా, సింగపూర్, యుకె, ప్యూర్టోరికో, దక్షిణాఫ్రికా లాంటి ఓ అరడజన్ సుమారుగా 3,300 చైన్ రెస్టారెంట్లున్నాయి. మెక్ డోనాల్డ్, స్టార్ బక్స్, సబ్ వే వగైరా పోటీ సంస్థలకు చిక్ పిల్ల కంటే రెస్టారెంట్లు చాలా ఎక్కువ.

చిక్ పిల్ల ఫ్రాంచైజీ ఎంపిక చాలా కఠినతరం. వాటిల్లో అతి ముఖ్యమైనవి రెండు.

(1) రెస్టారెంట్ రోజువారీ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నం కావాలి. రియల్ ఎస్టేటో మరొకటో చేసుకుంటూ ‘చిక్ పిల్ల’ని నడుపుకుంటానంటే కుదరదు. వారానికి 60 గంటలపాటు రెస్టారెంట్ కోసం సమయం వెచ్చించాలి.

(2) చిక్ పిల్ల యాజమాన్యపు క్రైస్తవ తెగ సంప్రదాయ విలువల్ని పాటిస్తూ నడుపుకోవాలి.

1946లో `Chick- Fil A’ రెస్టారెంటుని ట్రూట్ కేథి (S.Truett Cathy) అనే వ్యాపారస్తుడు ఆరంభించారు. అతను క్రైస్తవ మతంలో ‘ప్రొటెస్టెంట్ (Protestant)’ వర్గానికి చెందినవారు. ‘భగవంతుడికి భక్తుడికి మధ్య ఎలాంటి దర్బారు బత్తి అక్కర్లేదు. బైబిల్ ప్రాతిపదికన నేరుగా దైవంతో సంధానం కావచ్చు. విశ్వాసమే ముఖ్యం’ అనే స్థూలార్థంతో… 1517లో జర్మన్ మతాధికారి మార్టిన్ లూథర్ ఒక సంస్కరణవాదాన్ని ప్రతిపాదించారు. దానినే ‘ప్రొటెస్టెంటిజం (Protestantism) ’ అంటారు. ఆ వర్గానికి చెందిన వ్యాపారి ట్రూట్ క్యాథీ.
తమ మత సంప్రదాయాలకు, విశ్వాసాలకు ఎలాంటి భంగం కలగకూడదన్న ఉద్దేశంతో 1946 నుంచి ఇప్పటిదాకా దాదాపు 80 ఏళ్లుగా క్యాథీ కుటుంబ వ్యాపారం (ప్రొప్రయిటరీ కన్సర్న్)గానే నిర్వహిస్తున్నారు.

ఏటా 2,300 కోట్ల డాలర్ల టర్నోవర్ ఉన్నప్పటికీ… ఐపిఓకి వెళ్లలేదు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చలేదు. ‘వ్యాపారానికి మించిన విషయాలు అనేకం ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టాలి. దేవుని గౌరవించాలి. అందువల్లనే మేము ఆదివారాలు మూసేస్తాం . (Our decision to close on Sunday was our way of honoring God and of directing our attention to things that mattered more than our business)’ అన్నారు ట్రూట్ క్యాథీ ఓ ఇంటర్వ్యూలో.

Chick Fil అంటే చికెన్​ ఫిలెట్​ (మెత్తటి చికెన్​ ముక్క), Aకి అర్థం Grade A top quality chicken సప్లయ్ చేస్తామని.

Ps : అమెరికా వెళ్లినప్పుడు నాకు నచ్చిన రెస్టారెంట్లలో ‘చిక్ ఫిల ఏ’ ఒకటి. వాళ్ల నిర్వహణ గురించి విని, ఆసక్తిగా Short sheets, Finance platform లాంటి వెబ్సైట్లలో మరింత చదివి రాశాను. ఇంకా బోలెడంత రాయొచ్చుగానీ, ఇప్పటికే ఎక్కువైందని ఆపేశాను.

Popular Articles