ట్రంప్ సర్కార్ నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి, భక్తిశ్రద్దల్ని గుర్తిద్దాం.
ఆయన సర్కార్ సమర్ధతలే అమెరికా అగ్రరాజ్య స్థానాన్ని అంతం చేస్తాయేమో!
ప్రపంచంలో అతిపెద్ద జీడీపీతో నెంబర్ వన్ ఆర్ధిక వ్యవస్థ అమెరికా! 38 ట్రిలియన్ల అప్పుతో అతిపెద్ద అప్పుల కొంప కూడా అమెరికాయే! వార్షిక వడ్డీ చెల్లించలేని స్థితికి చేరిన దేశమూ అమెరికాయే! ఆ స్థితిలో దాని పూర్వ వైభవస్థితి పునరుద్దరణ (మాగా) కోసం అనివార్యంగా అది యుద్ధ ఆర్ధిక వ్యవస్థగా మారకుండా ముందడుగు వేయడం సాధ్యం కాదు. ఆ కర్తవ్య సాధన కోసం అమెరికా యుద్ధ ఆర్ధిక వ్యవస్థ చేత ప్రగాఢ విశ్వాసంతో ఎన్నికైన పాలకుడే డోనాల్డ్ ట్రంప్!
తనపై నమ్మకంతో ఎన్నుకున్న అమెరికా యుద్ధ ఆర్ధిక వ్యవస్థకు జవాబుదారీ పాత్రను ట్రంప్ సర్కార్ పోషించి తీరాలి. అందుకోసం తన సర్కార్ ని తీర్చిదిద్దుకొని సారధ్యం వహించాల్సిన బాధ్యత ట్రంప్ పై వుంది. వెనెజువెలాపై చర్యతో అది తన బాధ్యతను చిత్తశుద్ధితో నిరూపణ చేసుకుంది. మొదట ఈ నిజాన్ని గుర్తిద్దాం.
ట్రంప్ ని ఎవరు ఎన్నుకున్నారనే ప్రశ్నకు రెండు జవాబులు వున్నాయి. ఒకటి, అమెరికా ప్రజలు! మరొకటి, అమెరికా సామ్రాజ్యవాద ఆర్థిక వ్యవస్థ! ఈ రెండు జవాబుల వెనక రెండు దృష్టి కోణాలున్నాయి. ఓ కోణంలో వెనుజువెలాపై దాడి దురాక్రమణ చర్య! మరో కోణం ప్రకారం అదో సదాక్రమణ చర్య! ఈ స్పష్టత మనకు వుండాలి.
ఈ రాజకీయ సూత్రం కేవలం ట్రంప్ సర్కార్ వరకే వర్తించేది కాదు. మోడీ సర్కార్ తో సహా ప్రపంచ దేశాల సర్కార్లకి వర్తించే నియమమే.
చరిత్ర గమనం చాలా విచిత్రంగా ఉంటుంది. తలచింది, జరిగింది ఒకటిగా వుండని చాలా సందర్భాలు చరిత్రలో వుంటాయి. తన పూర్వ వైభవం (మాగా) కోసం పూనుకున్నంత మాత్రాన ఆ లక్ష్యం సిద్దిస్తుందని అనుకోరాదు. చరిత్రలో ఉచ్ఛ స్థితికి చేర్చే అనేక పథకాలు ఆచరణలో బెడిసికొట్టి పతనానికి కారణాలుగా మారాయి. ఇప్పుడు పునరావృతం అవుతుందేమో!
ప్రాచీన యుగంలో రోమ్ సామ్రాజ్యం ఎలా పతనమైనదో, ఆధునిక యుగారాంభ కాలంలో స్పేయిన్, పోర్చుగల్ తమ అగ్రరాజ్య స్థితిని ఎలా కోల్పోయాయో, పారిశ్రామిక విప్లవం తర్వాత అగ్రరాజ్యాలుగా బలపడి స్థిరపడ్డ బ్రిటన్, ఫ్రాన్స్ తమ స్థానాలను ఎలా కోల్పోయాయో, ప్రపంచ విప్లవ కేంద్రంగా ఏర్పడి ప్రత్యామ్నాయ అగ్రరాజ్యంగా కూడా రూపొందిన USSR తదనంతర కాలంలో 15 దేశాలుగా ముక్కలై ఎలా కూలిందో మన కళ్లెదుట నిలువెత్తు చారిత్రిక సాక్షులుగా నిలుస్తాయి. ప్రపంచ గమనంలో ఆ వంతు బహుశా నేడు అమెరికాకి వచ్చిందేమో!

స్థల కాలాదులను ఆధారంగా చేసుకొని వర్తమాన ప్రపంచ చరిత్ర గమనాన్ని విశ్లేషణ చేస్తే, అగ్రరాజ్యంగా అంతరించే దిశలో “ట్రంప్ అమెరికా” ప్రయాణం చేస్తున్నదని అర్ధమౌతోంది. ఏమైనా వర్తమాన అమెరికా ఆర్ధిక, రాజకీయ వ్యవస్థ పతన దారిలో ట్రంప్ సర్కార్ నిర్ణయాత్మక పాత్రధారిగా చరిత్రలో నిలిచే అవకాశం వుందనే చెప్పాలి. 250 ఏండ్లలో అంచెలంచెలుగా ఎదిగి అగ్రరాజ్యంగా, ఒక దశలో ఏకైక అగ్రరాజ్యంగా సైతం వర్ధిల్లిన అమెరికా కూడా అనివార్యంగా చరిత్రలో కూలిన గత సామ్రాజ్యాల సరసన ఏదో ఒక దశలో చేరాల్సి వుంది. అలాంటి పాత్రధారిగా బహుశా ట్రంప్ ని చరిత్ర ఎంపిక చేసి ఉంటుందేమో!
అమెరికా స్వతంత్ర దేశంగా 1776 లో ఏర్పడింది. ఈ ఏడాది జులై నెలకు 250 ఏండ్లు నిండుతాయి. ఈ సుదీర్ఘ అమెరికా చరిత్రలో జార్జి వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, మన్రో, అబ్రహం లింకన్, ఊడ్రో విల్సన్, రూజ్ వెల్ట్, ట్రూమన్, ఐసేన్ హోవర్, నిక్సన్, రీగాన్, జార్జి బుష్ వంటి కొందరు పాలకులు మైలురాళ్ళ పాత్రలను పోషించారు. అమెరికా చరిత్ర గమనంలో అవి ముందడుగులు కావచ్చు, వెనకడుగులు కావచ్చు. ఏమైనా మైలురాళ్లుగా నిలిచే పాత్రధారులే! ట్రంప్ సర్కార్ కూడా ఓ మైలురాయిగా నిలిచే అవకాశం వుంది. అయితే అంచెలంచెలుగా 250 ఏండ్ల నుండి ఎదిగిన చరిత్ర గమన దిశలో కాదు. దానిని వెనక్కి నడిపించే పతన దారిలో మాత్రమే సుమా!
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1945లో అగ్రరాజ్యంగా ఏర్పడి 1956 సూయెజ్ యుద్ధ దశలో అది స్థిరపడింది. ఈ 80 ఏండ్ల అగ్రరాజ్యం ఏదో ఒక రోజున పతనం కావాలి కదా! ఆ స్థానాన్ని మరొకరికి ఇవ్వకుండా ట్రంప్ సర్కార్ స్వంతం చేసుకుంటుందేమో! అందుకు వెనెజువెలాపై దురాక్రమణ చర్య నాంది పలుకుతుందేమో! చరిత్ర గమనాన్ని పరిశీలన చేస్తూ ఏం జరుగుతుందో వేచి చూద్దాం.
✍️ ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

