Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

ఆ కోట్ల డబ్బు ఏయే ఖాతాల్లోకి వెళ్లింది..!?

కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన సైబర్ నేరాల విలేకరి వసూల్ చేసిన కోట్ల రూపాయల లావాదేవీలపై మరో కోణంలో పోలీస్ దర్యాప్తు సాగుతోంది. పెట్టుబడులకు డబుల్ ధమాకా రీతిలో డబ్బులు వస్తాయంటూ ప్రజలను మోసగించి కోట్లు కొల్లగొట్టిన వేర్వేరు కేసుల్లో ఖమ్మానికి చెందిన ఓ ప్రముఖ పత్రిక విలేకరిని కరీంనగర్ సైబర్ క్రైం పోలీసులు నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ కోసం కోర్టులో హాజరుపర్చిన సంగతి తెలిసిందే. సైబర్ నేరాల్లో నిందితునిగా పోలీసులు అరెస్ట్ చేసిన ఆ విలేకరిని ప్రముఖ పత్రిక గత రాత్రి తొలగించింది కూడా.

గోవా టూర్లు, కాసినోవా జూదం వంటి జల్సా అంశాలతో ముడిపడిన ఈ భారీ మోసంలో మొత్తం ముగ్గురు నిందితుల్లో ఒకడైన విలేకరిపై మొత్తం ఎనిమిది కేసులు నమోదై ఉన్నట్లు కరీంనగర్ పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కోన్నారు. ఇందులో కరీంనగర్ లో రెండు, మహారాష్ట్రలోని వార్దా, సేవాగ్రామ్, ఛత్తీస్ గఢ్ లోని బలూద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఇవిగాక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కారేపల్లి, ఖానాపురం హవేలీ, కూసుమంచి పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఒక్కో కేసు చొప్పున నమోదై ఉన్నాయి.

తెలంగాణా, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రలతో కలిపి మొత్తం మూడు రాష్ట్రాల్లో నమోదైన సైబర్ నేరాల కేసుల్లో ముగ్గురు సభ్యుల ముఠాలో ప్రముఖ పత్రికలో నిన్నటి వరకు గల విలేకరి కూడా ఉండడం గమనార్హం. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు విలేకరి ఖాతాలో దాదాపు రెండు కోట్ల రూపాయాల లావాదేవీలు జరిగినట్లు సైబర్ క్రైం దర్యాప్తు అధికారులు గుర్తించి వెల్లడించారు. బాధితులను మోసగించి లక్షల చొప్పన వసూల్ చేసిన కోట్ల రూపాయల లావాదేవీల్లో విలేకరి ఖాతా నుంచి ఎవరెవరికి దారి మళ్లాయనే కోణం నుంచి తాజా దర్యాప్తును ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ ప్రముఖ పత్రికలో ముఖ్య బాధ్యతల్లో గల ఒకరి బ్యాంకు ఖాతాకు ఈ విలేకరి అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

దీంతో సైబర్ నేరాల ఉదంతంలో నిందితునిగా మారిన విలేకరి నేపథ్యం సదరు పత్రికలోని ఓ ముఖ్యవ్యక్తిని, ఇంకో విలేకరిని కూడా చుట్టుముట్టే అవకాశాలున్నట్లు సమాచారం. పత్రికకు చెందిన ఈ ముఖ్య వ్యక్తి బ్యాంకు లావాదేవీలను, విలేకరి ఖాతా నుంచి ఇంకా ఎవరెవరి ఖాతాల్లోకి డబ్బు మళ్లిందనే అంశంపైనే తాజాగా సైబర్ క్రైం అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. దీంతో నిన్నా, మొన్నటి వరకు కూడా సైబర్ నేరాల విలేకరికి వెన్నుదన్నుగా నిలిచినట్లు ప్రచారంలో గల ఆ పత్రిక ముఖ్యుడొకరికి ముచ్చెమటలు పడుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి ఈ వ్యవహారం ఇంకా ఏయే కోణాల్లో మరెందరి అరెస్టుకు దారి తీస్తుందో..?

Popular Articles