కేంద్ర మంత్రి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మాదేవి (32) దారుణ హత్యకు గురయ్యారు. సుష్మాదేవి తన భర్త రమేష్ చేతిలోనే కాల్చివేతకు గురయ్యారు. బీహార్ లోని గయా జిల్లా టెటువాలో చోటు చేసుకున్న ఈ ఘటన కేంద్ర మంత్రి మాంఝీ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
బుధవారం పగలు 12 గంటల ప్రాంతంలో సుష్మాదేవి భర్త రమేష్ పని నుంచి ఇంటికి వచ్చిన సందర్భంలో ఇరువురి మధ్య గొడవ జరిగినట్లు, దీంతో రమేష్ నాటు తుపాకీ తీసుకుని కాల్పులకు దిగినట్లు ఘటనా స్థలంలో గల సుష్మాదేవి సోదరి పూనమ్ మీడియాకు చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో సుష్మాదేవి పిల్లలు కూడా అక్కడే ఉన్న పరిస్థితుల్లో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కాగా ఘటనానంతరం రమేష పరారయ్యాడు. నిందితున్ని పట్టుకునేందుకు స్పెషల్ టీంను ఏర్పాటు చేసినట్లు గయా ఎస్పీ స్థానిక మీడియాకు చెప్పారు. సుష్మాదేవిని పొట్టనబెట్టుకున్న రమేష్ ను ఉరి తీయాలని ఆమె సోదరి పూనమ్ డిమాండ్ చేశారు. రమేష్, సుష్మాదేవిలకు పధ్నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది.

