కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ ఓ కీలక అంశంపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఎనిమీ ప్రాపర్టీస్ (శత్రు ఆస్తులు) అనే అంశంపై ఆయన నిర్వహించిన సమీక్ష తెలంగాణాలో ఆసక్తికర చర్చకు దారి తీసిందనే చెప్పాలి. తన కేంద్ర, రాష్ట్ర అధికారులతో సంజయ్ ఈ సమీక్ష నిర్వహించారు. వచ్చే మార్చిలోపు ఎనిమీ ప్రాపర్టీస్ లెక్క తేల్చాలని ఆయన ఆదేశించారు. ఈలోగా రికార్డుల పరిశీీలన, సర్వే పూర్తి చేయాలని సూచించారు. ఎనిమీ ప్రాపర్టీస్ అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంజయ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు.
ఇంతకీ ఎనిమీ ప్రాపర్టీస్ అంటే ఏమిటి?
రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమీ ప్రాపర్టీస్ కు చరిత్ర ఉంది. దాని ప్రకారం.. 1962లో చైనీస్ దండయాత్ర, 1965 నుండి 1971 వరకు నిర్వహించిన ఇండో-పాక్ యుద్దం అనంతరం భారత్ నుండి పలువురు తమ ఆస్తులను ఇక్కడే వదిలేసి వెళ్లిపోయారు. పాకిస్తాన్, చైనాల్లో స్థిరపడి ఆయా దేశాల పౌరసత్వం తీసుకున్న వ్యక్తులకు సంబంధించి భారత్ లో ఉన్న ఆస్తులను శత్రు(ఎనిమీ ప్రాపర్టీ) ఆస్తులుగా ప్రభుత్వం గుర్తించింది. వీటి సంరక్షణ బాధ్యతలను కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా(సెపీ)కు అప్పగించింది.

తెలంగాణ, ఏపీతోపాటు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 13 వేల వరకు శత్రు ఆస్తులున్నట్లు కేంద్రం వద్ద రికార్డులున్నాయి. వీటి మార్కెట్ విలువ రూ. వేల కోట్లు ఉన్నట్లు గుర్తించింది. ఎనిమీ ప్రాపర్టీ చట్టంలోని సెక్షన్ 8(ఏ) ప్రకారం ఈ ఆస్తులను విక్రియంచే అధికారం కేంద్రానికి ఉంది. అయితే నాటి నుండి నేటి వరకు ఈ ఆస్తులు చాలా చోట్ల అన్యాక్రాంతమయ్యాయి. మరికొన్ని ఆస్తులకు సంబంధించి న్యాయ వివాదాలు నడుస్తున్నాయి. తెలంగాణాలోని హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లోని శత్రు ఆస్తులు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా 234 వరకు ఎనిమీ ప్రాపర్టీస్ ఉన్నట్లు తెలుస్తుండగా, ఇందులో జిల్లాల వారీగా రంగారెడ్డిలో 180, హైదరాబాద్ లో 44, భద్రాద్రి కొత్తగూడెంలో 7, వికారాబాద్ లో 3 చొప్పున ఈ ఆస్తులు ఉన్నట్లు సమాచారం. వీటిలో అనేక ఆస్తులు ఆక్రమణలో ఉన్నట్లు, మరికొన్ని ఆస్తుల్లో భవనాలు నిర్మించినట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శనివారం హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో రాష్ట్రంలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లోని ఎనిమీ ప్రాపర్టీస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తొలుత రంగారెడ్డి జిల్లాలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కొత్వాల్ గూడ, మియాపూర్ పరిధిలో ఉన్న వందలాది ఎకరాల ఎనిమి ప్రాపర్టీస్ పై పురోగతి ఏమిటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సర్వే నెంబర్ల వారీగా పురోగతిని వివరించారు. కొన్ని స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని, మరికొన్ని చోట్ల రైతులు ఆక్రమించుకున్నారని తెలిపారు. ఏళ్ల తరబడి పొజిషన్ లో ఉన్న రైతులకు అన్యాయం జరగకుండా, అదే సమయంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్చి నెలాఖరులోపూ సర్వే, రికార్డుల పరిశీలన పూర్తి చేసి నివేదిక అందించాలని కోరారు.