Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

క్లియర్..! నక్సల్స్ తో శాంతి చర్చలపై కేంద్రం వైఖరి చెప్పిన బండి సంజయ్!?

మావోయిస్టులతో శాంతి చర్చల అంశానికి ఇక ఫుల్ స్టాప్ పడినట్లేనా? ఈ అంశంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు శాంతి చర్చలపై కేంద్రం వైఖరిని స్పష్టం చేసినట్లేనా? ‘ఆపరేషన్ కర్రెగుట్ట’ కొనసాగుతున్న నేపథ్యంలో, నక్సల్స్ తో శాంతి చర్చలు జరపాలనే డిమాండ్లు పెరుగుతున్న పరిణామాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుండ బద్దలు కొట్టిన తరహాలో కేంద్రం వైఖరిని చెప్పకనే చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నక్సలైట్లతో చర్చలు జరపాలనే అంశంపై ప్రజా సంఘాలపైనే కాదు, సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వైఖరులపై బండి సంజయ్ తీవ్రంగానే స్పందించారు. ఇంతకీ ఈ విషయంలో బండి సంజయ్ కరీంనగర్ లో ఏమన్నారో ఆయన మాటల్లోనే..

‘‘నిన్ననే చూసిన నేను.. ఏదీ ముఖ్యమంత్రిగారి మాటలు చూసిన నిన్న.. ఏదీ ఆపరేషన్ కగార్ విషయంలో.. ఇప్పుడూ వాళ్ల చేతిల తుపాకులుంటయ్..మావోయిస్టుల చేతిల తుపాకులున్నయ్.. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగారేమంటున్నరు..? సామాజిక కోణంల చూస్తున్నమంటున్నరు.. ఇదెక్కడి పద్దతి? వాళ్ల చేతుల తుపాకులున్నయ్..? వాళ్లు మైన్సును బెట్టిండ్రు పోలీసులను సంపడానికి..మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులను నిషేధించింది..కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం.. మీ పార్టీ నిషేధించినటువంటిదాన్ని మీరు పట్టించుకోకుండా, దాన్ని సామాజిక కోణంలో చూస్తమని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడమూ.., మంత్రులు దీన్ని ఖండించడమూ.. ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే.. దైర్యముంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగారిని.. ఛలో మావోయిస్టులపై నిషేధం తొలగించే దమ్ము మీకుందా మరి? ప్రజలు తిరగబడ్తరు ఇవ్వాళ.. గిరిజనుల పేరుతోని దాన్ని చూడడం మంచి పద్ధతి కాదు..గిరిజనులెవరూ పోలీసోల్లను చంపరు.. గిరిజనులెవరూ మైన్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు..గిరిజనులెరూ అమాయకులను చంపరు..గిరిజనుల చేతుల తుపాకులుండయ్..కాబట్టి అనేక మంది అమాయకులను చంపిండ్రు..మల్ల దానిమీద ఈ సంఘాలెప్పుడు మాట్లాడయ్..ఇయ్యాలొచ్చి..ఇయ్యాల చర్చలు జరపాలంటె.. తుపాకీ చేతుల ఉన్నటువంటి వ్యక్తులతోని, నిషేధింపబడిన సంస్థతోని ప్రభుత్వం ఏవిధంగా చర్చలు జరపాలె..? దానిమీద చెప్పాలె ?

ఈ నాయకులకు ఒక్కటే స్పష్టంగ చెప్తున్న.. ఇద్దరు నాయకులకు చెప్తున్న నేను. మీరు పోటీపడి వాళ్లకు (మావోయిస్టులకు) సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నరు..ఇవ్వాళ మహాముత్తారం మండలంలో ఒక ఎస్ఐని బ్లాస్టింగ్ తోని చంపేసిండ్లు.. ఆరోజు ఎస్ఐ భార్య సీమంతం పాపం..కానిస్టేబుల్ ను చంపేసిండ్లు ఆరోజే.. ఆ కానిస్టేబుల్ కొడుకు బర్త్ డే.. మరి ఆరోజు ఈ కేసీఆర్ గారు ఏమైండ్రు..? రేవంత్ రెడ్డిగారు ఏడ బోయిండ్రు? దూరదర్శన్ రిపోర్టర్ కవరేజ్ కోసం పోతే ఆయనను చంపేసిండ్లు ఈ నక్సలైట్లు.. మరి ఆరోజు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు..? ఈ సంఘాలు ఎందుకు మాట్లాడలేదు? ఈ రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు? అరే.. వరంగల్ల సామా జగన్మోహన్ రెడ్డి అనే మా కార్యకర్తను చంపేసిండ్రు.. అప్పుడెండుకు మాట్లాడలేదు వీళ్లు? రామన్న, గోపన్నను చంపేసిండ్లు.. అప్పుడెందుకు మాట్లాడలేదు వీళ్లు? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేసిండ్లు చాలా మందిని.. అజాత శత్రవు శ్రీపాదరావును చంపేస్తే.. కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నపుడు టీడీపీ నాయకులను చంపేసిండ్రూ.. అప్పుడెందుకు మాట్లాడలే..? కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు..? ఇయ్యాల పోటీబడి మాట్లాడే ప్రయత్నం జేస్తున్నరు.. కేంద్ర బలగాలను మైన్స్ బెట్టి ఇదే ములుగు ఫారెస్టులో చంపడమూ.. వీళ్లు సమర్థిస్తరా? ఈ ఇద్దరు నాయకులు సమర్ధిస్తరా? చర్చలు జరిపే ప్రసక్తే లేదు..వాళ్లు తుపాకీ వీడాల్సిందే..పోలీసులకు లొంగిపోవలసిందే..వాళ్ల ప్రవర్తన మార్చుకోవలసిందే.. అది నిషేధిత సంస్థ.. ఆ సంస్థతోని చర్చలు జరిపే సందర్భమే రాదు.. ఈ సంఘాల నాయకులు కూడా వాళ్లు చేసినటువంటి అరాచకాలకు వీళ్లు ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలె..’’ అని బండి సంజయ్ అన్నారు.

ఈ నేపథ్యంలో బండి సంజయ్ వ్యాఖ్యలను కేంద్రం వైఖరిగానే భావించవచ్చని విప్లవ కార్యకలాపాల పరిశీలకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని తెలంగాణా వ్యాప్తంగా పెరుగుతున్న గళాలపై ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, ఆ రాష్ట్ర హోం మంత్రి విజయ్ శర్మలు ఇటీవల స్పందిన తీరు తెలిసిందే. బస్తర్ వాసులు నక్సల్స్ తో చర్చలు జరపాలని కోరుకోవడం లేదని, అసలు చర్చల అంశంలో మాట్లాడేందుకు వీళ్లెవరు? అంటూ ఛత్తీస్ గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ తెలంగాణా లీడర్లను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. మరోవైపు ఆపరేషన్ కగార్ ను కొనసాగించాలని బస్తర్ ప్రాంత నక్సల్స్ బాధిత కుటుంబాలు ఇటీవల ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి.

కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

ఈ పరిణామాల్లోనే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం కరీంనగర్ లో చేసిన వ్యాఖ్యలు, నక్సల్స్ తో చర్చల అంశంపై స్పందించిన తీరు కేంద్రం వైఖరిగానే పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందనే వాదన వినిపిస్తోంది. వచ్చే మార్చి నెలాఖరులోగా నక్సల్స్ రహిత దేశంగా మార్చడం ఖాయమంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలు సందర్భాల్లో పదే పదే పునరుద్ఘాటిస్తున్న నేపథ్యంలో అటు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ పెద్దలు, ఇటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించిన తీరు అసలు విషయాన్ని చెప్పకనే చెబుతోందని విప్లవ కార్యకలాపాల పరిశీలకులు పేర్కొంటున్నారు.

Popular Articles