ఛత్తీస్ గఢ్: నక్సల్స్ తో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అయితే చేబూనిన ఆయుధాలను వదిలేసి లొంగిపోయే నక్సలైట్లను స్వాగతిస్తామని ఆయన చెప్పారు. జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్లకు ప్రభుత్వం పునరావాసాన్ని కల్పిస్తుందని చెప్పారు. బస్తర్ జిల్లాలో జరిగిన దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ షా జగదల్ పూర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ఛత్తీస్ గఢ్ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం గడచిన దశాబ్ధ కాలంలో రూ. 4.00 లక్షల కోట్లకు పైగా నిధులను కేటాయించిందని చెప్పారు. ఛత్తీస్ గఢ్ అభివృద్ధికోసం భవిష్యత్తులో మరిన్ని నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. వచ్చే మార్చి నెలాఖరునాటికి దేశం నక్సల్స్ రహితంగా మారుతుందని కూడా అమిత్ షా పునరుద్ఘాటించారు. శాంతి చర్చల అంశంలో మావోయిస్ట్ పార్టీకి చెందిన కీలక నేతల మధ్య భిన్నాభిప్రాయాలతో కూడిన లేఖలు విడుదలవుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి ఈ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.