సోషల్ మీడియా సైకోలు రెచ్చిపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై అసత్య ప్రచారానికి తెగబడ్డారు. ఈ చర్య వెనుక ఓ రాజకీయ పార్టీకి చెందిన కరడుగట్టిన కార్యకర్తల హస్తముందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిరిసిల్లలో బుధవారం చోటు చేసుకున్న ఓ వివాదాస్పద ఘటన తర్వాతే కలెక్టర్ పై సోషల్ మీడియా సైకోలు అసత్య ప్రచారానికి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
తన వ్యక్తిత్వాన్నికి మచ్చ తెచ్చేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తన ప్రకటనలో హెచ్చరించారు. తనపై వివిధ కేసులు ఉన్నట్లుగా సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, తనపై ఎటువంటి కేసులు లేవని ఆయన స్పష్టం చేశారు.
తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాలు పోస్ట్ చేస్తున్న వారిపై, అసత్యాలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. ఇప్పటికే కొంత మందిపై కేసులను నమోదు చేయడం కూడా జరిగిందని కలెక్టర్ తెలిపారు. అసత్య ఆరోపణలు, కట్టుకథల ఆధారంగా మీడియా, సామాజిక మాధ్యమాలలో వార్తలను ప్రచారం చేయవద్దని, అనవసరంగా కేసులలో ఇరుక్కోవద్దని కలెక్టర్ తన ప్రకటనలో పేర్కొన్నారు.