Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

మద్దేడు ఏరియా దళం క్లోజ్? ధ్రువపడని ఎన్కౌంటర్ ‘కత’!

ఛత్తీస్ గఢ్: ఇది పోటీ ప్రపంచం.. మీడియాలో ఈ పోటీ మరీ తీవ్రం. అదీ, ఇదీ, వాళ్లూ, వీళ్లూ అనేదేమీ లేదు.. సాధారణ యూ ట్యూబర్ నుంచి ప్రముఖ మీడియా సంస్థల వరకు అందరిదీ ఒకటే దారి. అదిగో హిడ్మా.. ఇదిగో ఎన్కౌంటర్.. ఛత్తీస్ గఢ్ లో భీకరపోరు.. ముగ్గురు మావోయిస్టులు మృతి.. తెల్లారేసరికి చనిపోయిన నక్సల్స్ సంఖ్య ఏడుకు పెరుగుతుంది. కానీ ఘటనను ధ్రువీకరించేవారెవరూ లేరు. పోలీసులు ధ్రువీకరించలేదని వార్తలోనే వివరణ ఇచ్చే స్థితి. ఇదీ నిన్నటి నుంచి ప్రచారంలోకి వచ్చిన ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు వ్యాప్తిలోకి వచ్చిన ఎన్కౌంటర్ ‘కత’.

తెలంగాణా సరిహద్దుల్లోని ఛత్తీస్ గఢ్ అడవుల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు నిన్న ఎదురుకాల్పులు జరిగాయనేది వ్యాప్తిలోకి వచ్చిన సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు ‘క్వశ్చన్ మార్క్’తో ప్రచురితమైన వార్తల సారాంశం. కానీ ఎవరూ ధ్రువీకరించలేదని కూడా అవే వార్తల్లో వివరణ కూడా. నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ సాగుతోందని, భద్రతా బలగాలు తిరిగివచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని బీజాపూర్ జిల్లా పోలీసు అధికారి పేర్కొన్నట్లు కూడా వార్తా కథనాల్లోనే పేర్కొన్న అంశం. ఇది నిన్న రాత్రి వరకు ప్రాచుర్యంలోకి వచ్చిన సమాచారంతో ప్రచురితమైన వార్తల కంటెంట్.

గురువారం ఉదయానికి ఎన్కౌంటర్ ‘సీన్’ మారింది. ముగ్గురు కాదు.. ఏడుగురు మావోయిస్ట్ నక్సలైట్లు మరణించారనేది తాజాగా జరుగుతున్న ప్రచారం. ఈ ఘటనలో మద్దేడు ఏరియా దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనేది కూడా మరో ప్రచారం. వాస్తవం ఏమిటనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ధ్రువపడని ఈ ఎన్కౌంటర్ ఘటనపై ఛత్తీస్ గఢ్ పోలీసులు కూడా ఎటువంటి అధికారిక ప్రకటనను ఈ వార్త రాసే సమయానికి కూడా విడుదల చేయలేదు. అప్పటి వరకు ధ్రువపడని ఎన్కౌంటర్ ‘కత’కు సంబంధించిన వార్తలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే అవి ఛత్తీస్ గఢ్ అడవులు. వచ్చే మార్చి నెలాఖరునాటికి నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని కేంద్రం కంకణం కట్టుకున్న నేపథ్యం.

అందువల్ల చెప్పొచ్చేమిటంటే.. ప్రస్తుత ఛత్తీస్ గఢ్ అడవుల్లోని పరిస్థితులపై, పరిణామాలపై ఏ మీడియా ఎటువంటి ‘కత’నాలైనా రాసుకోవచ్చు. ముఖ్యంగా ధ్రువపడని ‘ఎన్కౌంటర్’లో ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, దేవ్ జీ, హిడ్మా వంటి నాయకులు మరణించినట్లు రాసినా అడిగేవారెవరూ ఉండరు. ఖండించేవారు అంతకన్నా కనిపించరు. తలలు పండిన సీనియర్ జర్నలిస్టులు కూడా యూ ట్యూబుల్లో అనుభవపు ‘మార్క్’కు విరుద్దంగా సంచలన ‘కత’నాలు చెప్పేస్తున్నారు. ‘వ్యూస్’ పెంచేసుకుంటున్నారు. ఇదీ ధ్రువపడని ఎన్కౌంటర్ ‘కత’కు సంబంధించిన తాజా సమాచారం. ధ్రువపడిన తర్వాత, ఛత్తీస్ గఢ్ పోలీసులు ప్రకటించిన తర్వాత బీజాపూర్ ఎన్కౌంటర్ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని భావించవచ్చు.

Popular Articles