మన ఇంట్లో పంచాయితీ ఎవరూ వినొద్దు.. చూడొద్దు.., కానీ పక్కింటి పంచాయితీని మాత్రం మనం చెవులు రిక్కరించి మరీ వింటుంటాం.. గోడ పక్కన నక్కి లేదా కిటికీ సందుల్లోంచి చూస్తుంటాం.. ఇది మనుషుల సహజ లక్షణంగా, స్వభావంగా పలువురు చెబుతుంటారు. సరిగ్గా ఈ నిర్వచనానికి సారూప్యతగా గులాబీ పార్టీ పత్రిక తీరుతెన్నులు సోమవారం కనిపించడమే ఈ కథనంలోని అసలు సారాంశం. ఇంతకీ విషయమేమిటంటే..?
దిగువన గల రెండు వార్తా కథనాల క్లిప్పింగులను ఓసారి చూడండి. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం ఉంది కదా? ఆ నియోజకవర్గంలో రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ సందర్భంగా కాంగ్రెస్ వర్గాలు గొడవకు దిగాయట. మంత్రి వివేక్ వెంకటస్వామి అక్కడ ఉండగానే, ఆయన సమక్షంలోనే స్థానిక కాంగ్రెస్ లీడర్ల అనుచరులు, అనుయాయులు లొల్లి పెట్టుకున్నాయట. అదేవిధంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ లో వర్గపోరు జరుగుతోందట. మంత్రి సీతక్క ఎదుటనే పోచారం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డిల వర్గీయులు కొట్లాటకు దిగాయట. మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిపై అనర్హత వేటు కత్తి వేలాడుతోందని, ఇలాగైతే వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు గడ్డు కాలమేనని తేల్చేసింది గులాబీ పార్టీ పత్రిక ‘నమస్తే తెలంగాణా’.

పత్రికను స్థాపించిందే పార్టీ ప్రయోజనం కోసం కాబట్టి కాంగ్రెస్ లో గల సహజ పంచాయతీలను ఇలా తన పాఠకుల ముందుంచడంలో ‘నమస్తే తెలంగాణా’ తన విద్యుక్త ధర్మాన్ని సరిగ్గానే నిర్వహించింది. కానీ ఇదే దశలో తమ బాస్ పార్టీలోని ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య ఆదివారం నాటి కీలక పరిణామాలకు సంబంధించి మాత్రం అక్షరం ముక్కకు కూడా చోటు కల్పించకపోవడమే ఆసక్తికర అంశం. గులాబీ పార్టీ చీఫ్ కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిల మధ్య నిన్నటి వ్యాఖ్యల దుమారం గురించి తెలిసిందే. లిల్లీపుట్ అంటూ జగదీశ్వర్ రెడ్డిని ఉద్ధేశించి కవిత, ‘వారి జ్ఞానానికి జోహార్లు’ అంటూ కవితను ఉటంకిస్తూ జగదీశ్వర్ రెడ్డి పరస్పర వ్యాఖ్యలు చేసుకున్న ఉదంతాలపై దాదాపు అన్ని ప్రధాన పత్రికలు ప్రముఖంగానే వార్తా కథనాలను ప్రచురించాయి. టీవీ ఛానళ్లయితే తమదైన శైలిలో మస్త్ హడావిడి చేశాయి.

కానీ గులాబీ పార్టీ పత్రిక మాత్రం కవిత, జగదీశ్వర్ రెడ్డిల వ్యాఖ్యల పంచాయితీకి సంబంధించి ఎక్కడా అక్షరం ముక్కకు స్థానం కల్పించలేదు. సింగిల్ కాలమ్ వార్తకే చోటు దక్కని పరిస్థితుల్లో కవిత, జగదీశ్వర్ రెడ్డిల వ్యాఖ్యల వివాదపు ఫొటోల ప్రచురితాన్ని ఆశించడం కూడా అత్యాశే అవుతుందేమో! మొత్తంగా కవిత వార్తలకు తమ పత్రికలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆ పత్రిక ఉద్యోగ వర్గాలే చెబుతుండడం ఆసక్తికర. కవిత పోరాటానికి, ఆమె వార్తలకు గులాబీ పార్టీ పత్రిక ‘నమస్తే’ చెప్పినట్లుగానే తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా జగదీశ్వర్ రెడ్డి కవితపై చేసిన వ్యాఖ్యలను ప్రచురిస్తే, కవిత ఏమన్నారో కూడా చెప్పాల్సి వస్తుంది కదా? అందుకే ఇద్దరి వార్తలకు స్థానం దక్కలేదనేది ఆ పత్రిక ఉద్యోగ వర్గాల వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీలోని పంచాయతీలను తన పాఠకులకు అందిస్తున్న గులాబీ పార్టీ పత్రిక తమ బాస్ పార్టీకి చెందిన లొల్లిని పట్టించుకోకపోవడం ‘మంది రచ్చపై ఇచ్ఛ.. మన రచ్చపై కచ్చ’గా పేర్కొనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కదా!