పెనుబల్లి: సైబర్ నేరాలకు పాల్పడడం ద్వారా ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఉడతనేని వికాస్ చౌదరి అండ్ ముఠా దోపిడీ చేసిన నగదు మొత్తం రూ. 549.95 కోట్లుగా ఖమ్మం జిల్లా పోలీసులు తేల్చారు. ఉడతనేని వికాస్ చౌదరి అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడి సమీప బంధువు కావడం గమనార్హం. ఈ ముఠా సైబర్ దోపిడీకి సహకరించిన 17 మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పెనుబల్లి పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
సీపీ సునీల్ దత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నెల 24వ తేదీన సత్తుపల్లి మండలం తుంబూరుకు చెందిన మోదుగ సాయికుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన పేరుతో వలవిసిరి ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు మనోజ్ కళ్యాణ్, పోట్రు ప్రవీణ్, మేడ భానుప్రకాష్, మేడా సతీష్, మోరంపూడి చెన్నకేశవ అనే వ్యక్తులు సైబర్ నేరాలకు పాల్పడడం ద్వారా రూ. 549.95 కోట్ల భారీ మొత్తాన్ని కొల్లగొట్టారు.
కేసు విచారణలో భాగంగా నిందితులైన ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు మనోజ్ కళ్యాణ్ ల కుటుంబ సభ్యుల, అనుచరుల బ్యాంక్ అకౌంట్లను పోలీసులు పరిశీలించగా దిగ్భ్రాంతి కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. పోట్రు మనోజ్ కళ్యాణ్ బ్యాంకు ఖాతాలో రూ. 114.18 కోట్లు, అతని భార్య మేడా భానుప్రియకు చెందిన రెండు బ్యాంకు ఖాతాల్లో రూ. 45.62 కోట్లు, మనోజ్ కళ్యాణ్ బామ్మర్ది అయినటువంటి మేడా సతీష్ ఖాతాలో రూ. 135.48 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి ఖాతాలో రూ. 81.72 కోట్లు, కరీంనగర్ కు చెందిన తాటికొండ రాజు అనే వ్యక్తికి చెందిన నరసింహా కిరాణం అండ్ డెయిరీ ఖాాతాలో రూ. 92.54 కోట్లు, ఉడతనేని వికాస్ చౌదరి ఖాతాలో రూ. 80.41 కోట్ల చొప్పున లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

సత్తుపల్లి పరిసర గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువకులను ఉద్యోగాల కల్పన పేరుతో పిలిపించుకుని, వారికి ఉద్యోగం ఇచ్చి, వారితో ప్రముఖ బ్యాంకుల్లో ఖాతాను తెరిపించి, ఆయా అకౌంట్లలో క్రెడెన్షియల్స్ ను తీసుకుని నిందితులు కోట్ల రూపాయల సైబర్ క్రైమ్ నేరాల సొత్తును జమ చేయడానికి వినియోగించారు.
ఈ సైబర్ నేరాల రాకెట్ లో నిందితులకు సహకరించినందుకుగాను సదాశివపాలెం, సీతారాంపురం, రామానగరం, తుమ్మూరు గ్రామాలకు చెందిన జుంజునూరి శివక్రిష్ణ, వడ్లమూడి నరేంద్ర, మల్లాది శివ, సాధు పవన సందీప్, సాదు సంధ్య, సాధు లేఖలను అరెస్ట్ చేశారు.
అదేవిధంగా లింగపాలెం గ్రామానికి చెందిన జొన్నాదుల తిరుమల, కందుకూరి మణికంఠ, తన్నీరు మహేష్, గోళ్లమూడి నాగముఖేష్, కంచపోగు శ్రీనివాస్, రాయల అజయ్ కుమార్, రాయల గోపి, పల్లా గణేష్, రాయల గోపిచంద్, కందుకూరి జగదీష్, కరీంగనర్ కు చెందిన తాటికొండ రాజులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోట్రు ప్రవీణ్ ను ఇప్పటికే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీపీ సునీల్ దత్ వివరించారు.

