(‘సమీక్ష’ ప్రత్యేక కథనం)
విదేశీయుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఓ సైబర్ క్రైం కేసులో ఉడతనేని వికాస్ అనే వ్యక్తి ఖమ్మం జిల్లా పోలీసులకు కొరకరాని కొయ్యగా మారాడనే ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో మొదటి నిందితుడు (A1) పోట్రు ప్రవీణ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, మిగతా నలుగురు నిందితుల్లో ఒకడైన సత్తుపల్లి పట్టణానికి చెందిన ఉడతనేని వికాస్ అనే యువకుడి పేరు వింటేనే హడలిపోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సైబర్ క్రైం నిందితున్ని అరెస్ట్ చేయడానికి రాష్ట్రవ్యాప్త ఖ్యాతిగల ఖమ్మం పోలీసులు హడలిపోవడమేంటి..? అని ఆశ్చర్యపోకండి. నేరాలకు పాల్పడే చాలా మంది నిందితుల్లో కొందరికి ఇక్కడ పొలిటికల్ పవర్ ఉంటుంది. ఆ పవర్ ధాటికి పోలీసులు నిశ్ఛేష్టులుగా ఉండాల్సిన ఒత్తిళ్లు ఉంటాయనే ప్రచారానికి బలం చేకూర్చే ఆసక్తికర కథనమిది.
వివరాల్లోకి వెడితే.. సాధారణంగా సైబర్ క్రైం కేసుల్లో విదేశీయుల ద్వారా మనవాళ్లు మోసపోతుంటారు. కానీ సత్తుపల్లి ప్రాంతానికి చెందిన పోట్రు ప్రవీణ్ అండ్ గ్యాంగ్ వల్ల అస్ట్రేలియన్లు, కంబోడియన్లు సైతం వంచనకు గురయ్యారంటే వీళ్ల సైబర్ క్రైం ‘టాలెంట్’ను చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారట. ఇటువంటి సైబర్ క్రైం మోసపు ఘటనకు సంబంధించి మోదుగు సాయికిరణ్ అనే వ్యక్తి గత నెల 24వ తేదీన ఖమ్మం జిల్లా వీఎం బంజర (పెనుబల్లి) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులోని క్తుప్త సారాంశం ప్రకారం పోట్రు ప్రవీణ్ అండ్ గ్యాంగ్ నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని చెప్పి, వారి పేరున బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి, వారి ఖాతాల్లోకి సైబర్ నేరాల ద్వారా కొల్లగొట్టిన కోట్ల రూపాయల డబ్బును వెనకేసుకున్నట్లు ఆరోపణలు.

ఈ ఫిర్యాదుపైనే పెనుబల్లి పోలీసులు గత నెల 24వ తేదీన 234/2025 ఎఫ్ఐఆర్ ద్వారా 318(4),319(2),336(3),338,r/w 3(5) BNS,66-D ITA-2000-2008 చట్టాల్లోని విధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1గా పోట్రు ప్రవీణ్, A2గా పోట్రు కళ్యాణ్, A3గా మోరంపూడి చిన్నకేశవులు, A4గా జంజునూరి శివక్రిష్ణ, A5గా ఉడతనేని వికాస్ లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఆయా నిందితులు సైబర్ క్రైం నేరాల ద్వారా సంపాదించిన డబ్బుకు ‘Extrika Solutions’ అనే పేరుగల సంస్థను కేంద్రంగా చేసుకున్నారనేది ఫిర్యాదులోని మరో ముఖ్యాంశం.
అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రల్లోనే కాదు, విదేశాల్లోనూ ప్రకంపనలకు హేతువైన భారీ సైబర్ నేరాల చిట్టాకు సంబంధించిన ఈ కేసులోని నిందితుల్లో ఒకడైన ఉడతనేని వికాస్ అనే యువకుడు తాజాగా సంచలనాంశంగా మారడం విశేషం. కేసులో A1 పోట్రు ప్రవీణ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఉడతనేని వికాస్ ను కూడా అదుపులోకి తీసుకున్న సందర్భంగా భారీ ఎత్తున రాజకీయ ప్రమేయం చోటు చేసుకుందనే ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి సమీప బంధువుగా భావిస్తున్న ఉడతనేని వికాస్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇప్పుడు వెనుకంజ వేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
సైబర్ క్రైం నేరాల్లో ఆరితేరినట్లు వ్యాప్తిలోకి, వార్తల్లోకి వచ్చిన ఉడతనేని వికాస్ పై ఇతర రాష్ట్రాల్లోని పలు కేసులు ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవల ఖమ్మం జిల్లా పోలీసులు ఉడతనేని వికాస్ ను అదుపులోకి తీసుకున్నదే తడవుగా రాష్ట్రంలోని అత్యున్నత అధికార కేంద్రం నుంచి తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు ధ్రువపడని సమాచారంతో కూడిన ప్రచారం జరుగుతోంది. దీంతో అదుపులోకి తీసుకున్న వికాస్ ను గత్యంతరం లేని పరిణామాల్లో దారి మధ్యలోనే వదిలేసినట్లు ఆయా ప్రచారపు సారాంశం.
ఈ పరిస్థితుల్లో ఉడతనేని వికాస్ అరెస్ట్ అంశంలో తాజాగా పోలీసులు సైతం పెద్దగా స్పందించే పరిస్థితి కనిపించడం లేదని సత్తుపల్లి ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. సైబర్ నేరాలకు పాల్పడి వందలాది కోట్లను కొల్లగొట్టినట్లు బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన ఉడతనేని వికాస్ పూర్తి నేపథ్యం, అతనికి గల పొలిటికల్ పవర్, ఖమ్మం పోలీసులకు సవాల్ విసురుతున్న వైనంపై మరో కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

